Begin typing your search above and press return to search.

కూట‌మి ఎఫెక్ట్‌: సెల‌వుపై సీఐడీ బాస్‌

తాజాగా ఏపీ సీఐడీ చీఫ్‌.. సంజ‌య్ కుమార్‌.. సెల‌వు పెట్టారు. దాదాపు ఆయ‌న నెల రోజుల పాటు సెల‌వు పెట్టారు.

By:  Tupaki Desk   |   5 Jun 2024 9:26 AM GMT
కూట‌మి ఎఫెక్ట్‌: సెల‌వుపై సీఐడీ బాస్‌
X

అంద‌రూ ఊహించిన ప‌రిణామాలే ఏపీలోనూ చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూట‌మి క‌నుక అధికారంలోకి వ‌స్తే.. ప‌లువురు ఉన్న‌తాధికారులు త‌ప్ప‌కుండా.. సెల‌వు పెట్ట‌డ‌మో.. లేక వేరే ప్రాంతాల‌కు బ‌దిలీ చేయించుకోవ‌డ‌మో చేస్తార‌ని.. ముందు నుంచి అటు మీడియా.. ఇటు విశ్లేష‌కులు చెప్పినట్టుగానే.. ఏపీలో ప‌రిణామాలు మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయ‌కుల‌ను వైసీపీ ప్ర‌భుత్వంలో టార్గెట్ చేసిన పోలీసు శాఖ ఉన్న‌తాధికారులు ఈ విష‌యంలో ముందున్నారు.

తాజాగా ఏపీ సీఐడీ చీఫ్‌.. సంజ‌య్ కుమార్‌.. సెల‌వు పెట్టారు. దాదాపు ఆయ‌న నెల రోజుల పాటు సెల‌వు పెట్టారు. విదేశాల‌కు వెళ్తున్న‌ట్టు తెలిపారు. వ‌చ్చే 3 వ తేదీ వ‌ర‌కు. ఆయ‌న సెల‌వులో ఉండ‌నున్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను అమెరికా వెళ్తున్న‌ట్టు ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ సెల‌వుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి కూడా.. అనుమ‌తించిన‌ట్టు స‌మాచారం. దీంతో సంజ‌య్‌.. ఓ నెల రోజుల పాటు. సెల‌వులో ఉండ‌నున్నారు.

ఇలా ఎందుకు ?

సంజ‌య్ సెల‌వు పెట్ట‌డానికి కార‌ణం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌ల‌పై కేసులు పెట్ట‌డ‌మేన‌ని తెలుస్తోంది. స్కిల్ కుంభ‌కోణంలో చంద్ర‌బాబును అరెస్టు చేయ‌డం.. రాజ‌మండ్రి జైల్లో పెట్ట‌డం వంటివి సంజ‌య్ చుట్టూ చుట్టుకున్నాయి. అలానే ఫైబ‌ర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌పై నా ఆయ‌న కేసులు న‌మోదు చేశారు. అయితే..ఎన్నిక‌ల‌కు ముందు అరెస్టు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా.. కోర్టు కు వెళ్ల‌డంతో వెన‌క్కి త‌గ్గారు.

ఇక‌, ఇత‌ర నేత‌ల‌పైనా కేసులు పెట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌పైనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కొత్త ప్ర‌భుత్వం త‌క్ష‌ణం త‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని సంజ‌య్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆయ‌న సెల‌వుపై వెళ్లి న‌ట్టు భావిస్తున్నారు. ఏదేమైనా.. మ‌రికొంద‌రు అధికారులు కూడా సెల‌వుపై వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఉన్న‌త విద్య‌మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న హేమ‌చంద్రారెడ్డి కూడా.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.