Begin typing your search above and press return to search.

మార్గదర్శి కేసులో కీలక పరిణామం... ఏ1 - ఏ2 లకు పిలుపు!

ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సూచించారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:07 AM GMT
మార్గదర్శి కేసులో కీలక పరిణామం... ఏ1 - ఏ2 లకు పిలుపు!
X

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం కేసు పెట్టిన సీఐడీ అధికారులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మళ్లీ నోటీసులు పంపారు.

అవును... మార్గద‌ర్శి చిట్‌ ఫండ్స్‌ లో అవ‌క‌త‌వ‌క‌ల కేసులో ఆ సంస్థ‌ అధినేత రామోజీరావుకు, ఎండీ శైలజా కిర‌ణ్‌ కు సీఐడీ మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. వారు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసుల్లో పేర్కొంది. రామోజీరావు ఈ నెల 16న, శైల‌జా కిర‌ణ్ ఈ నెల 17వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఏపీ సీఐడీ కీలక ఆదేశాలు జారీచేసింది.

ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సూచించారు. సీఐడీ రీజ‌న‌ల్ కార్యాల‌యంలో విచార‌ణ జ‌రుగుతుంద‌ని ఆయా తేదీల్లో వారు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సీఐడీ సూచించింది. ఈ మేరకు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ రాజశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే... గ‌తంలోనూ విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని రామోజీరావుకు, శైల‌జా కిర‌ణ్‌ కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే అప్పట్లో వారు విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు! ప్రస్తుతం విచార‌ణ నిమిత్తం 41 (ఎ) కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గద‌ర్శి కేసులో రామోజీరావు ఏ-1గా, శైల‌జా కిర‌ణ్ ఏ-2గా ఉన్న విష‌యం తెలిసిందే.

కాగా... మార్గదర్శి ఛిట్ ఫండ్ ఆఫీసుల్లోనూ, కంపెనీ మేనేజర్ల నివాసాలపైనా కూడా గతంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లోని తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ పరిణామాల మధ్య ఏపీ సీఐడీ అధికారులు రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేశారు. మార్గదర్శిలో డబ్బులను డిపాజిట్ చేసిన చందాదారుల నిధుల మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహారం సాగుతుందని తెలిపారు! ఈ మేరకు రామోజీని విచారించారు.