నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. రీజనేంటంటే
రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు విజయవాడలోని సీఐడీ కేసులు విచారిస్తున్న కోర్టును ఆశ్రయించారు.
By: Tupaki Desk | 29 Dec 2023 3:59 PM GMTటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ``రెడ్ బుక్ `` అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు విజయవాడలోని సీఐడీ కేసులు విచారిస్తున్న కోర్టును ఆశ్రయించారు. దీంతో నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి సీఐడీ కోర్టు వాయిదా వేసింది.
ఏంటీ రెడ్ బుక్?
నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ పేరును ప్రస్తావించారు. అది కూడా అన్నమయ్య జిల్లాలో యువగళం పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో(వాస్తవానికి చిత్తూరు జిల్లాలోనూ అడ్డుకున్నారు) ఇలా.. యువగళం పాదయాత్రకు నిబంధనలకు విరుద్ధం అడ్డుకునే వారి పేర్లు రాసుకుంటున్నామని.. అన్నీ రెడ్ బుక్‌లో నిక్షిప్తం అవుతున్నాయ ని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వారి సంగతి చూస్తామని అప్పట్లో నారాలోకేష్ హెచ్చరించారు. ఇక, అప్పటి నుంచి యాత్ర ముగిసే వరకు కూడా రెడ్ బుక్ ప్రధాన అంశంగా మారింది.
రెడ్ బుక్ లో కేవలం అధికారుల పేర్లు మాత్రమే కాకుండా.. వైసీపీ ప్రజాప్రతినిధుల పేర్లు కూడా రాసుకుంటున్నట్టు ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన యాత్ర సమయంలో నారా లోకేష్ ప్రకటించారు. అప్పటి వరకు పెద్దగా రాజకీయ దుమారం రేగని రెడ్ బుక్ వ్యవహారం అప్పటి నుంచి తీవ్ర విమర్శలకు గురైంది. మంత్రి జోగి రమేష్ దారుణ వ్యాఖ్యలతో రెడ్ బుక్ విషయంపై విరుచుకుపడ్డారు. ఇటీవల మరోసారి రెడ్ బుక్ విషయం చర్చకు వచ్చింది. ఇది కూడా రాజకీయంగా వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు సీఐడీ కోర్టుకు రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారని.. మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ కోర్టులో అఫిడవిట్ వేశారు.