స్కిల్ కుంభకోణంపై సీఐడీ కీలక ప్రకటన!
కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమేనని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 11 Sep 2023 12:02 PM GMTచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014–2019 మధ్య స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా ఈ వ్యవహారంలో ఏపీ సీఐడీ సంచలన ప్రకటన చేసింది. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఇది దిగ్భ్రాంతి కలిగే అంశమని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొంది. పీవీ రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్ తోనే కేసు మొత్తం నడవడం లేదని తేల్చిచెప్పింది.
దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రమేనని ఏపీ సీఐడీ వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయని కుండబద్దలు కొట్టింది. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలున్నాయని తేల్చిచెప్పింది. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం అని స్పష్టం చేసింది.
కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమేనని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుందని పేర్కొంది. నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పీవీ రమేశ్ పట్టించుకోలేదని సీఐడీ ఆరోపించింది. రూ.371 కోట్లు విడుదల చేసే ముందు, అంతమొత్తం ఒకేసారి విడుదల చేయడం కరెక్టుకాదని దిగువ స్థాయి వారించారని గుర్తు చేసింది.
పైలట్ ప్రాజెక్టుగా ఒక స్కిల్ హబ్ కు ముందుగా విడుదల చేద్దామని దిగువ స్థాయి అధికారి గట్టిగా సూచించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఎక్కడో గుజరాత్ లో చూసి వచ్చాం, అంతా కరెక్టు అనుకోవడం సమంజసంగా లేదని దిగువ స్థాయి అధికారి చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని సీఐడీ వెల్లడించింది.
దిగువ స్థాయి అధికారి లేవనెత్తిన ఈ అభ్యంతరాలను, సూచనలను అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న పీవీ రమేశ్ పక్కనపెట్టారని సీఐడీ ఆరోపించింది. ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయని తెలిపింది. పీవీ రమేశ్ చెప్పినట్టుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును తాము విచారణకు స్వీకరించలేదని స్పష్టం చేసింది.