Begin typing your search above and press return to search.

బాబుని కస్టడీకి ఇవ్వండని సీఐడీ పిటిషన్

By:  Tupaki Desk   |   10 Sep 2023 6:23 PM GMT
బాబుని కస్టడీకి ఇవ్వండని సీఐడీ పిటిషన్
X

చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ని కోర్టు విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి జైలుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న బాబుని సీఐడీ కష్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. బాబుని సీఐడీ కస్టడీకి పదిహేను రోజుల పాటు ఇవ్వాలని కోరింది. బాబు మీద అనేక సెక్షన్లతో కేసుని నమోదు చేసిన సీఐడీ ఇపుడు వాటి మీద దర్యాప్తు వేగవంతం చేయాలని చూస్తోంది.

సీఐడీ కస్టడీకి ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ విషయంలో అనేక కీలక అంశాల మీద బాబు నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టడానికి ఏపీ సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాబుని శనివారం రాత్రి సిట్ ఆఫీసులో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఆయన అన్నింటికీ తెలియదు, గుర్తులేదు అని సమాధానాలు ఇచ్చారు.

దాంతో బాబు విచారణకు సహకరించడంలేదని ఆయనను కస్టడీకి ఇస్తే లోతైన విచారణ జరుపుతామని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ బాబుని సీఐడీ కష్టడీకి అప్పగిస్తే ఆయనను పూర్తి స్థాయిలో విచారిస్తారని అంటున్నారు.

మరో వైపు చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ఇంటి భోజనం అందేలా చూడాలని ఆయన తరఫున టీడీపీ లాయర్లు వేసిన పిటిషన్ని కోర్టు సానుకూలంగా పరిగణించింది. బాబుకు రాజమండ్రి జైలులో ప్రత్యేక వసతి, ఇంటి నుంచి భోజనం వంటి వాటి మీద వేసిన పిటిషన్ల్ల ఏసీబీ కోర్టు తన నిర్ణయం వెలువరించింది. బాబుకు జైలులో ప్రత్యేక గదితో పాటు ఇంటి నుంచి భోజనం అందించేందుకు అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించింది.

దాంతో బాబు తరఫున వేసిన పిటిషన్ కి కోర్టులో ఊరట లభించింది. మరో వైపు హౌస్ అరెస్ట్ గా బాబు రిమాండ్ ని పరిగణించాలని టీడీపీ వేసిన మరో పిటిషన్ విషయంలో సోమవారం ఏసీబీ కోర్టు విచారిస్తుందని తెలుస్తోంది. మరి దీని మీద కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.