Begin typing your search above and press return to search.

వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు.. కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ.. అసలేం జరిగింది?

ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్ టీఏ అధికారి డి.వాసుదేవరెడ్డి షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 4:35 AM GMT
వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు.. కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ.. అసలేం జరిగింది?
X

ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్ టీఏ అధికారి డి.వాసుదేవరెడ్డి షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన నివాసం ఉన్న ఇంటిపై శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వేళలో ఏపీ సీఐడీ అధికారులు రావటం.. సాయంత్రం వరకు సోదాలు నిర్వహించటం కలకలాన్ని రేపింది. స్థానిక నార్సింగి పోలీసుల నుంచి నలుగురు పోలీసుల టీంను తమతో తీసుకెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆయన ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించి.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఎన్నికల వేళలో ఆయనపై తీవ్ర ఆరోపణలు రావటంతో ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేయటం తెలిసిందే.

ఇంతకీ ఆయన మీద ఉన్న నేరారోపణలు ఏమిటి? ఆయనపై ఫిర్యాదు చేసింది ఎవరు? అన్న విషయానికి వస్తే.. ఈ నెల ఆరో తేదీన విజయవాడలో కొన్ని పత్రాల్ని హడావుడిగా తరలిస్తున్న వ్యక్తిని తాను చూశానని.. అతడి గురించి ఆరా తీస్తే వాసుదేవ రెడ్డిగా తెలుసుకొని కంప్లైంట్ చేశారు కంచికచర్ల వాసి గద్దె శివక్రిష్ణ. ఆయన ఆరోపణ ఏమంటే.. ఏపీలోని జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా సాగించిన మద్యం కుంభకోణంలో ఆయనే కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఎపీఎస్ బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి పలు ఫైళ్లు.. కంప్యూటర్ పరికరాలు.. ఇతర పత్రాల్ని వాసుదేవరెడ్డి కారులో తరలిస్తున్న విషయాన్ని తాను చూసినట్లుగా ఇచ్చిన ఫిర్యాదును తీసుకోవటానికి తొలుత పోలీసులు అంగీకరించలేదు. అనంతరం సీఐడీ అధికారులు ఈ అంశాన్ని టేకప్ చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న సమయంలో మద్య తయారీ.. కొనుగోలు.. సప్లై.. అమ్మకాలకు సంబంధించిన పలు వివరాల్ని గుట్టుచప్పుడు కాకుండా అక్రమ పద్దతిలో తరలించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్ కు వెళ్లిన వైనాన్ని గుర్తించిన అధికారులు అక్కడకు చేరుకున్నారు.

విజయవాడ ప్రసాదంపాడులోని సాయివిహార్ అపార్టుమెంట్ లో ఉండే వాసుదేవరెడ్డి జూన్ ఆరో తేదీన పెద్ద ఎత్తున ఫైళ్లు.. కంప్యూటర్ పరికరాల్ని కారులో లోడ్ చేస్తున్నప్పుడు తాను చూసినట్లుగా పేర్కొన్న వ్యక్తి.. అతన్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా హడావుడిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లటంపై తనకు సందేహం కలిగినట్లుగా శివక్రిష్ణ చెబుతన్నాడు. హైదరాబాద్ లోని నానక్ రాంగూడలోని మైస్కేప్ కోర్ట్ యార్డ్ గేటెడ్ కమ్యూనిటీలో 41వ నెంబరు విల్లాలోని నివసించే వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుకీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి వరకు సోదాలు.. విచారణ సాగించి ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. వాసుదేవ రెడ్డి నివాసం ఉన్న విల్లా ఏపీ వైసీపీకి చెందిన ఒక నేతదిగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన నేతదే సదరు విల్లాగా చెబుతున్నారు.