హైదరాబాద్ బావర్చి బిర్యానీలో సిగరెట్ పీక!
ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో పలు ప్రముఖ హోటళ్లు
By: Tupaki Desk | 26 Nov 2024 4:44 AM GMTతినే ఆహారం మీద అనుమానాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఊరు.. పేరు లేని హోటళ్లలో నాణ్యతను ఆశించటం అత్యాశే అవుతుంది. కానీ.. పేరు ప్రఖ్యాతులు పుష్కలంగా ఉండి.. జనాదరణకు లోటు లేని ప్రముఖ హోటళ్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అక్కడ ఎదురవుతున్న చేదు అనుభవాల్ని చూస్తున్న వేళ.. కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో పలు ప్రముఖ హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఫుడ్ కోర్టులు మాత్రమే కాదు.. బ్రాండెడ్ చైన్ ఫుడ్ కోర్టుల్లో నాణ్యతకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు.. అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న వాస్తవాల్ని చూస్తున్న వారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో హైదరాబాద్ లో పేరున్న రెస్టారెంట్లలో సింహ భాగం ఆహార నాణ్యత మీద వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వాటిలో తనిఖీలు నిర్వహించి.. అక్కడి శుభ్రతా ప్రమాణాలు ఏ మాత్రం బాగోలేవన్న విషయాన్ని అధికారులు గుర్తించి.. ఆయా రెస్టారెంట్ల యజమానులకు ఫైన్ వేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా హైదరాబాద్ బిర్యానీ అన్నంతనే గుర్తుకు వచ్చే నాలుగైదు ప్రముఖ బ్రాండ్లలో ఒకటి ముషీరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న బావర్చి.
దీనికున్న గుర్తింపు నేపథ్యంలో బావర్చి పేరుతో బోలెడన్ని రెస్టారెంట్లకు ఆ పేరు పెట్టటం కనిపిస్తుంది. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చారు. వారు తింటున్న బిర్యానీలో సిగరెట్ పీక కనిపించటంతో.. అక్కడి హోటల్ యాజమాన్యానికి ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అంశంపై తమకు ఫిర్యాదు అందినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. చికెన్ బిర్యానీ తినే వేళ.. సిగరెట్ పీక కనిపించటంతో అక్కడి నాణ్యత ఆందోళన కలిగించేలా చేసిందని వినియోగదారులు తమ కంప్లైంట్ లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సదరు రెస్టారెంట్ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.