స్కూల్ గా పోలీస్ స్టేషన్ ను మార్చి.. కడు పేదల్ని పోలీసుల్ని చేసిన సీఐ
అవును.. పోలీసులు అందరూ ఒకేలా ఉంటారన్నది పాత మాట. అందులోనూ ఆణిముత్యాల్లాంటి పోలీసులు కొందరు ఉంటారు
By: Tupaki Desk | 6 Oct 2023 5:01 AM GMTఅవును.. పోలీసులు అందరూ ఒకేలా ఉంటారన్నది పాత మాట. అందులోనూ ఆణిముత్యాల్లాంటి పోలీసులు కొందరు ఉంటారు. కష్టపడి.. మెట్టు మెట్టు ఎదిగి.. పోలీసు శాఖలో కొంతమేర ఎదిగిన వారు.. తాము వచ్చిన దారిని మర్చిపోకుండా.. తమ లాంటి మరికొందరికి మంచి భవిత ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసే పనులు వారిని మిగిలిన వారికి భిన్నంగా నిలిచేలా చేస్తుంటాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. ప్రస్తుతం టాస్కుఫోర్సు సీఐగా పని చేస్తున్న సైదులు.. గతంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు సీఐగా వ్యవహరించారు.
ఇలాంటి సమయంలో విధినిర్వహణలో భాగంగా.. తన స్టేషన్ పరిధిలోని బోరబండ.. పరిసర బస్తీల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు బడికి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉండటం.. చిత్తుకాగితాలు ఏరుకొని బతికే వారి పిల్లలు పెద్ద చదువు సంధ్యలు లేకుండా ఉండటాన్ని గుర్తించారు. అలాంటి వారిని 120 మందిని గుర్తించి వారికి పుస్తకాలు కొని.. ట్యూషన్ చెప్పించి.. స్కూల్ చేర్చారు. బస్తీ పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు కొందరు నిరుద్యోగ యువతీయువకులు వచ్చేవారు.
వారిని గమనించిన సీఐ సైదులు వారితో మాట్లాడినప్పుడు.. వారంతా డిగ్రీ పూర్తి అయి ఖాళీగా ఉంటున్నట్లుగా తెలుసుకున్నారు. వారంతా నిరుపేదలని.. గుడిసెల్లో నివసిస్తుంటారని తెలుసుకొని.. వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలోనే పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ వేయటంతో వారందరి చేత అప్లికేషన్లు పెట్టించాడు. అక్కడితో ఆగకుండా తాను పని చేసే ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోని రీడింగ్ రూంను క్లాస్ రూంగా మార్చారు. మొత్తం 23 మంది యువతీయువకులకు కోచింగ్ ఇప్పించటం షురూ చేశారు.
స్టేషన్ లో పని చేసే ఎస్ఐలతో పాటు.. కొందరు సిబ్బందితో ఖాళీగా ఉన్నప్పుడు వారి చేత పోటీ పరీక్షల్లో ఎలా ప్రిపేర్ కావాలి? ఏయే అంశాల మీద ఫోకస్ చేయాలన్న అంశాలతో పాటు.. వివిధ విషయాల మీద క్లాసులు ఇప్పించాడు. అంతేకాదు.. పోటీ పరీక్షకు మరింత సన్నద్ధం అయ్యేందుకు కోచింగ్ సెంటర్లలో చేర్పించి.. తానే వారికి అవసరమైన డబ్బులు కట్టాడు. కట్ చేస్తే.. తాజాగా వెలువడిన ఫలితాల్లో 23 మందిలో ఏకంగా 12 మంది పోలీస్ కానిస్టేబుళ్లుగా నియమితులైనట్లుగా ఫలితాలు వచ్చాయి. ఒక వ్యవసాయ కూలీ కొడుకైన తాను.. తన బాల్యంలో పడిన కష్టాల్ని మర్చిపోకుండా.. తన మాదిరే మంచి ఉద్యోగాల్లో సెటిల్ కావాలన్న ఒక సీఐ ఆలోచన కార్యరూపం దాల్చటమే కాదు.. అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. తాజా ఫలితాల నేపథ్యంలో సీఐ సైదులు గురించి తెలిసిన వారంతా ఆయన్ను అభినందిస్తున్నారు.