Begin typing your search above and press return to search.

టీడీపీ సోషల్ మీడియాతో అట్లుంటది.. అంతర్జాతీయ సంస్థైనా దిగిరావాల్సిందే..

టీడీపీ సోషల్ మీడియా పసుపు సైన్యం పట్టు సాధించింది. తాము పంతం పడితే ఎవరైనా సరే దిగిరావాల్సిందేనని నిరూపించింది.

By:  Tupaki Desk   |   1 April 2025 3:57 AM
Cisco Remove AP YCP Leader
X

టీడీపీ సోషల్ మీడియా పసుపు సైన్యం పట్టు సాధించింది. తాము పంతం పడితే ఎవరైనా సరే దిగిరావాల్సిందేనని నిరూపించింది. టీడీపీ సోషల్ మీడియా ఒత్తిడితో అంతర్జాతీయ సంస్థ సిస్కో కూడా తలవంచింది. తమ సంస్థ ఉద్యోగి, టెరిటరీ అకౌంట్స్ మేనేజర్ ఇప్పాల రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ చర్య ద్వారా పసుపు సైన్యం ప్రభావం మరోసారి చాటిచెప్పినట్లైంది.

ప్రముఖ ఐటీ సంస్థ సిస్కో నుంచి వైసీపీ సానుభూతిపరుడు ఇప్పాల రవీంద్రరెడ్డి ఔటయ్యారు. ఆయనను ఏపీ వ్యవహారాల నుంచి పక్కకు తప్పించాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ కార్యాలయం రాసిన లేఖను ఐటీ సంస్థ సిస్కో అంగీకరించింది. ఏపీ కార్యకలపాల నుంచి రవీంద్రారెడ్డిని తప్పించింది. ఓ అంతర్జాతీయ సంస్థ ఇలా చేయడం చర్చనీయాంశమవుతోంది. టీడీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా పవర్ ఎలాంటిదో ఈ సంఘటన రుజువు చేస్తుందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సిస్కోలో ఉద్యోగిపై రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ సోషల్ సైనికులు అంతలా ఆగ్రహించడానికి కూడా చాలా పెద్ద కారణమే ఉందని అంటున్నారు.

సరిగ్గా గత మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ స్కిల్ డెవలప్మమెంట్ కార్పొరేషన్, సిస్కో మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ఉన్నత, వృత్తి విద్యా విద్యార్థులకు ఐటీ, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఈ అవగాహన కుదర్చుకుంది. విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ ను సిస్కో అందజేయాల్సివుంటుంది. ఈ ఒప్పందం ద్వారా ఏపీలో 50 వేల మంది విద్యార్థులకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిపై సిస్కో శిక్షణ ఇస్తుంది. ఆ మేరకు వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఓ విధంగా ఇటు ఏపీ ప్రభుత్వంతోపాటు, సిస్కోకు కూడా ఈ ఒప్పందం పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం కుదిరిన వేళ సహజంగా ప్రభుత్వంతోపాటు టీడీపీ సైనికులు గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ, ఇక్కడే సమస్య మొదలైంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జరిగిన ఒప్పందంలో సిస్కో తరఫున ఇప్పాల రవీంద్రరెడ్డి అనే వ్యక్తి రావడం, లోకేశ్ తో సమావేశమైన టీములో ఆయన ఉండటం పెద్ద వివాదంగా మారింది.

సిస్కోలో టెరిటరీ అకౌంట్స్ మేనేజర్ రవీంద్రరెడ్డి గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ప్రచారం జరుగుతోంది. 2014-19 మధ్య దారుణమైన భాషతో టీడీపీ అగ్రనేతలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లోకేశ్ తో సమావేశమైన సిస్కో అధికారుల బృందంలో ఇప్పాల రవీంద్రరెడ్డిని చూసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రరెడ్డి గతంలో పెట్టిన పోస్టులను మళ్లీ వైరల్ చేశారు. గతంలో ఓ కేసులో అరెస్టు అయిన రవీంద్రరెడ్డిని లోకేశ్ తో సమావేశానికి ఎలా అనుమతిస్తారంటూ అధికారులపై దుమ్మెత్తిపోశారు. ఊహించని ఈ పరిణామంతో మంత్రి నారా లోకేశ్ కూడా కంగుతిన్నారు. సిస్కో బృందంలో ఇప్పాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తన ఓఎస్డీ ద్వారా లేఖ రాయించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మంత్రి నారా లోకేశ్ అభ్యంతరంపై అంతర్జాతీయ సంస్థ సిస్కో కూడా వేగంగా స్పందించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏపీ వ్యవహారాల నుంచి రవీంద్రరెడ్డిని తప్పించింది. ఈ పరిణామం టీడీపీ సోషల్ మీడియా విజయంగా చెబుతున్నారు. టీడీపీ సోషల్ సైనికులు తలచుకుంటే ఎవరైనా శంకరగిరి మాన్యాలకు వెళ్లాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు.