విజయవాడ ఎందుకు మునిగింది..? బుడమేరు కథ ఏంటి?
చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాన్ని వరద ముంచెత్తింది.
By: Tupaki Desk | 4 Sep 2024 6:17 AM GMTనాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు బెజవాడ బెదిరిపోయింది. వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు తోడు వరదలు పోటెత్తడంతో విజయవాడ నగరం మొత్తం నీటిలో చిక్కుకుపోయింది. ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. సాయం కోసం చేతులు చాచారు. నాలుగు రోజులుగా విజయవాడ ముంపులోనే ఉండడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాన్ని వరద ముంచెత్తింది. అంత పెద్ద నగరం ఎందుకు ఇలా వరద బారిన పడాల్సి వచ్చింది..? అంత పెద్ద సిటీ చుట్టూ ఎందుకు వరద చేరింది..? బెజవాడ ప్రజలు ఎందుకు బెంబేలెత్తాల్సి వచ్చింది..?
విజయవాడ నగరం కృష్ణమ్మ నది ఒడ్డున ఉంది. పెద్ద ఎత్తున వర్షాలు పడడం.. వరద గేట్లు కూడా తెరుచుకోవడంతో అందరూ కృష్ణ జలాలే విజయవాడను ముంచెత్తాయని భావించారు. కానీ.. వాస్తవం అది కాదనేది చాలా మందికి తెలియదు. అవును.. విజయవాడ ఈ రోజు అంతటి కష్టాలను అనుభవించడానికి కేవలం కృష్ణమ్మ జలాలే కారణం కాదనేది సుస్పష్టం.
మరి ప్రజలు అంత భారీ నష్టం చవిచూడాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు..!! నగర శివారుల్లోంచి ప్రవహిస్తున్న బుడమేరు అనే ఓ మాదిరి డ్రెయినే ఇంతటి ప్రళయానికి ప్రధాన కారణమైందని చీఫ్ ఇంజినీర్లు చెబుతున్నారు. బుడమేరు, మైలవరం కొండల్లో పుట్టిన అతి పెద్ద వాగు ఇది. అరిగిపల్లి, కొండపల్లి అనే రెండు కొండల మధ్య నుంచి ఇది మొదలవుతుంది. పొలాల్లోంచి వచ్చే అదనపు నీటిని కొల్లేరులో కలిపేందుకు ఈ మేజర్ డ్రెయిన్ ఉంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పొలాల్లోని మిగులు నీరు ఇందులో ప్రవహిస్తూ ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గం గుండా ఎన్టీఆర్ జిల్లాలోకి కలుస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లోని పులివాగు, భీమ్‌వాగు, లోయవాగును కలుపుకుని వెళ్తుంది. విజయవాడ శివారులోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంటుంది. దీని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. అయినప్పటికీ విజయవాడ రోదనకు కారణమైందనే చెప్పొచ్చు. 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఆ తరువాత 2009లోనూ అదే స్థాయిలో వరద ప్రవహించింది. కెపాసిటీకి మించి వరద వస్తుండడంతో అది నగరాన్ని ముంచెత్తుతోంది.
బుడమేరుకు సంబంధించి వరదను అరికట్టేందుకు మళ్లింపు కాలువ విస్తరణే ప్రధాన మార్గమని గతంలో ప్రతిపాదించారు. 2005లో వచ్చిన వరదలతో ఓ రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో కొంత మేర కసరత్తు కూడా చేశారు. కానీ.. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తిగా వదిలేశారు. అయితే.. అప్పట్లో వీటీపీఎస్ యాజమాన్యం అంగీకరించలేదని గత ప్రభుత్వం విస్తరణను వదిలేసిందని టాక్. దాంతో వరద ఎక్కువగా వచ్చినా బీడీసీ ద్వారా నీరు విడుదల చేసే వీలు లేకుండా పోయింది. పైగా బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణాలో కలిసిపోవాలంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటిమట్టం 12 అడుగుల మేరనే ఉండాలి. ఒకవేళ నీటి సామర్థ్యం పెరిగితే వరద నీరు వెనక్కి తన్నుతుంది.
వీటన్నింటికి తోడు వాగుకు ఇరువైపులా కబ్జాలు పెరిగిపోయాయి. ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్‌తో పెద్దలు గద్దలుగా వాలారు. ఇష్టారీతిన కబ్జాలకు పాల్పడి సొమ్ము చేసుకున్నారు. పలువురు నకిలీ పట్టాలు సైతం సృష్టించి ఇళ్లు నిర్మించారు. ఇలా కబ్జాలు సైతం ఈ పెను ఉపద్రవానికి కారణాలయ్యాయి.
ఈసారి వరదలకు ముంపునకు గురైన ప్రాంతాలన్నీ కూడా బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలోనివే. కేవలం రెండు రోజుల్లో కురిసిన వర్షంతో ప్రజలు ఆ స్థాయిలో వరద వస్తుందని కూడా అంచనా వేయలేకపోయారు. తెల్లారి లేచి చూసే సరికి వరద నీటితో నిండిపోయి ఉండడంతో ప్రజలంతా ఎటూ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. బుడమేరు వాగుకు కృష్ణా ప్రవాహం కూడా తోడవ్వడంతో విజయవాడ ప్రజలకు నిద్రలేని రాత్రులు తప్పలేదు. ఇప్పటికైనా బుడమేరు వాగు పరిధిలో తగిన సేఫ్టీ చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.