Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు దిగ్గజ బ్యాంక్‌ షాక్‌!

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరం కూడా ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 6:01 AM GMT
ఉద్యోగులకు దిగ్గజ బ్యాంక్‌ షాక్‌!
X

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరం కూడా ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు వారాలు కూడా కాలేదు. అప్పుడే ప్రముఖ దిగ్గజ బ్యాంక్‌.. సిటీ బ్యాంక్‌ తన ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. వచ్చే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని బాంబుపేల్చింది.

ఈ మేరకు సిటీ గ్రూప్‌ రాబోయే రెండేళ్లలో 20,000 మంది ఉద్యోగులను తొలగిస్తుందని సిటీ గ్రూప్‌ సీఎఫ్‌వో మార్క్‌ మాసన్‌ వెల్లడించారు. 2023 నాలుగో త్రైమాసికంలో కంపెనీ 1.8 బిలియన్‌ డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది. గత 15 సంవత్సరాలలో ఒక త్రైమాసికంలో సిటీ బ్యాంక్‌ చవిచూసిన భారీ నష్టం ఇదే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని సిటీ గ్రూప్‌ నిర్ణయించింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వల్ల దీర్ఘకాలంలో 2.5 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతాయని బ్యాంక్‌ అంచనా వేస్తోంది.

నాలుగో త్రైమాసికంలో నష్టాలతోపాటు ప్రాంతీయ బ్యాంకింగ్‌ సంక్షోభానికి సంబంధించి సిటీ బ్యాంక్‌ 1.7 బిలియన్‌ డాలర్ల చార్జీలు చెల్లించాల్సి ఉంది. అలాగే అర్జెంటీనాలో 880 మిలియన్‌ డాలర్ల నష్టం సంభవించింది. అదేవిధంగా 2023లో సుమారు 7,000 మంది ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో మళ్లీ పునర్నిర్మాణ ఖర్చులకు 800 మిలియన్‌ డాలర్ల వ్యయమైంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది, వచ్చే ఏడాది 20 వేల మంది ఉద్యోగులను తొలగించాలని సిటీ గ్రూప్‌ నిర్ణయించింది. ఈ తొలగింపుల వల్ల ఖర్చులు అదుపులోకి వస్తాయని, ఆదాయం పెరుగుతుందని సిటీ గ్రూప్‌ భావిస్తోంది.

కంపెనీ కార్యకలాపాలలో 20,000 ఉద్యోగాల కోతలతో పాటు మెక్సికన్‌ మెక్సికన్‌ రిటైల్‌ యూనిట్‌ నుండి 40,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని సిటీ బ్యాంక్‌ తెలిపింది, దీనితో కంపెనీలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,40,000 నుండి 1,80,000కి చేరుకుంటుంది.

కాగా ఈ 20,000 ఉద్యోగాల తొలగింపు కేవలం ఒక దేశంలోనూ, ప్రాంతంలోనూ ఉండవని సిటీ బ్యాంక్‌ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తొలగింపులు ఉంటాయని స్పష్టం చేసింది.

వచ్చే సంవత్సరాలలో బ్యాంక్‌ తన ప్రణాళికాబద్ధమైన పునర్నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు, పునర్వ్యవస్థీకరణ ఖర్చులకు 1 బిలియన్‌ డాలర్ల వరకు చెల్లించాలని భావిస్తున్నట్లు తెలిపింది.