పౌర విమానాలపై నుంచి అగ్ని గోళాలు... అప్రమత్తమైన పైలట్లు!
ప్రస్తుతం ప్రపంచం ముందు భారీ యుద్ధం పొంచి ఉందనే చర్చ తీవ్రంగా మొదలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Nov 2024 1:30 AM GMTప్రస్తుతం ప్రపంచం ముందు భారీ యుద్ధం పొంచి ఉందనే చర్చ తీవ్రంగా మొదలైన సంగతి తెలిసిందే. మరోపక్క.. మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లే అని ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి తెలిపారు. ఈ సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పౌర విమానాలకు ప్రాణాంతకంగా మారాయనే భయంకరమైన విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఇజ్రాయెల్ పై అక్టోబరులో ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. వీటిలో రెండు క్షిపణులు ఇజ్రాయెల్ ప్రధాని నివాసానికి సమీపంలో పడ్డాయనే కథనాలు వచ్చాయి! అయితే.. ఇరాన్ ప్రయోగించిన ఆ క్షిపణులు పౌర విమానాలకు ప్రాణాంతకంగా మారిన విషయం తాజాగా వెల్లడింది.
ఆ సమయంలో ఈ మార్గంలో సుమారు డజను విమానాలు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై అక్టోబర్ లో ఇరాన్ ప్రయోగించిన వాటిలో సుమారు 200 బాలిస్టిక్ మిసైల్స్ పౌర విమానాలపై నుంచి ఎగురుతూ వెళ్లినట్లు తెలిపింది.
ఆ సమయంలో ఈ విమానాలన్నీ ఇరాన్, ఇరాక్ గగనతలంలో ఉన్నాయని తెలిపింది. పైగా.. వాటిని కొంతమంది పైలట్లు, ప్యాసింజర్లు స్వయంగా చూసినట్లు వెల్లడించింది. అయితే... ఈ సమయంలో ఇరాన్ నుంచి విమానాలకు ఎలాంటి హెచ్చరికలు లేవని.. అయినప్పటికీ పరిస్థితిని పసిగట్టిన చాలామంది పైలట్లు మార్గాలను మళ్లించుకున్నారని పేర్కొంది.
కాగా.. అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోం వ్యవస్థ పూర్తిగా అడ్డుకోలేకపోయింది. "ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2" పేరిట ఈ దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది.