నిజం గెలవాలి లో క్లారిటీ లేదా...?
భువనేశ్వరి ఈ కేసు ఇలా ఉంది, ఇందులో నా భర్త ఏమి తప్పు చేశారు ఆయనకు ఏమిటి సంబంధం అని ధాటీగా కౌంటర్ ఇస్తే కనుక అది జనంలోకి బాగా వెళ్లే అవకాశం ఉంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Oct 2023 8:34 AM GMTచంద్రబాబు జైలులో ఉన్నారు. బయట టీడీపీ ఆందోళనలు చేస్తోంది. ఇక ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఆమె ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తన భర్త మీద అన్యాయంగా కేసు పెట్టి జైలులో పెట్టారు అన్న బాధతో భువనేశ్వరి నిజం గెలవాలి అంటున్నారు. ఆమె తన బాధను జనంతో పంచుకుని సానుభూతిని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.
అయితే భువనేశ్వరి ఎవరు అంటే ఆమె చంద్రబాబు సతీమణి. సాధారణంగా ఎవరైనా భర్త కానీ భార్య కానీ జనంలోకి వెళ్ళినపుడు తమ భాగస్వామి గురించి గొప్పగానే చెబుతారు. తప్పులు ఉన్నా ఒప్పుగానే చెబుతారు. ఇది సహజాతిసహజం. మూడవ మనిషి చెబితే వచ్చే ఇంపాక్ట్ సొంత కుటుంబీకులు వచ్చి చెబితే రాదు అని అంటారు. ఇదిలా ఉంటే భువనేశ్వరి మంచి మాటకారి కాదు,
రాజకీయాలు ఆమెకు తెలియవు. సరే ఆమె బోల్డ్ గా మాట్లాడినా ఫరవాలేదు. దాని నుంచి జనాలు తీసుకోవాల్సింది తీసుకుంటారు. కానీ ఆమె మాట్లాడుతున్నది అర్ధం అయి కానట్లుగా కన్ ఫ్యూజ్ చేసే విధంగా ఉంటున్నాయని అంటున్నారు. అసలు నిజం గెలవాలి టైటిల్ లోనే క్లారిటీ లేదు అని అంటున్నారు. నిజం అంటే ఎవరిది, సొంత కుటుంబీకులు అనుకున్నదే నిజం అయితే ఇక చట్టాలు ఎందుకు న్యాయ స్థానాలు అంతకంటే ఎందుకు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.
మరో వైపు చూస్తే నిజం గెలవాలి అని భువనేశ్వరి అంటూంటే అవును కదా, నిజమే గెలవాలి కదా అని అధికార వైసీపీ నేతలు కూడా అంటున్నారు. అవును నిజం గెలవాల్సిందే. అందుకే చంద్రబాబు జైలు పాలు అయ్యారని కౌంటర్లూ వేస్తున్నారు. దాంతో టైటిల్ దగ్గరే దెబ్బ పడిపోయింది అని కూడా అంటున్నారు.
ఇక భువనేశ్వరి మాటలనే తీసుకుంటే ఆమె నిజం గెలవాలి అని అంటున్నారు. సరే ఆమె చెప్పడం వరకూ బాగానే ఉంది అనుకున్న అసలు చంద్రబాబు ఈ కేసులో అవినీతి చేశారా లేదా అన్న దాని మీద ఆమె ఏమి చెబుతారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. తన భర్త తప్పు చేయలేదు అంటున్నారు. మరి కేసు ఉంది కదా, అది విచారణలో ఉంది కదా ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు. కానీ అసలు ఏమీ కాకుండా బాబుని జైలులో పెట్టరు కదా అన్న వాదన కూడా ముందుకు వస్తోంది.
భువనేశ్వరి ఈ కేసు ఇలా ఉంది, ఇందులో నా భర్త ఏమి తప్పు చేశారు ఆయనకు ఏమిటి సంబంధం అని ధాటీగా కౌంటర్ ఇస్తే కనుక అది జనంలోకి బాగా వెళ్లే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు గురించి చెబుతూ ఆయన ఈ కేసులో ఏమీ సంబంధం లేని వ్యక్తి అకారణంగా ఇరికించారు అని తనదైన శైలిలో వాదన వినిపిస్తే బాగా ఉండేది. కానీ చంద్రబాబుకు అనుభవం ఉందని, ఆయన గొప్పగా పాలించారని, రాత్రీ పగలూ ప్రజల కోసమే ఆలోచించారని భువనేశ్వరి చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
చంద్రబాబు మూడు సార్లు సీఎం అయిన సగంతి తెలుసు. రాజకీయంగా ఆయనకు అనుభవం ఉందన్న సంగతీ తెలుసు. అయితే అవి ఇపుడు ప్రస్తుత అంశాలు కానే కావు. నిజం గెలవాలి అన్నపుడు ఆ సబ్జెక్ట్ చుట్టూనే భువనేశ్వరి చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆమె అది వదిలేసి మిగిలిన విషయాల మీద మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటున్నారు.
ఇక చూస్తే చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో జైలు పాలు అయ్యారు. దీని వరసలోనే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది. అలాగే ఫైబర్ నెట్ కేసు ఉంది. ఇలా కేసులు పడుతున్నాయి. నా భర్తకు ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదని ఆధార సహితంగా భువనేశ్వరి చెప్పిననాడు ఆమె నిజం గెలవాలి అన్న యాత్ర సక్సెస్ అవుతుంది. అలా కాకుండా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ తో ఏపీకే నష్టం, ఆయనని బంధిస్తే ఏపీని టోటల్ గా బంధించినట్లు అని భువనేశ్వరి మాట్లాడుతున్న తీరు అయితే జనాలకు ఏ మాత్రం కనెక్ట్ కావడం లేదు అని అంటున్నారు.
అది కూడా బాబు అరెస్ట్ అయి జైలు జీవితం అర్ధ సెంచరీ దాటాక తాపీగా వచ్చి భువనేశ్వరి చెప్పే మాటలు అయితే తేలిపోతున్నాయనే అంటున్నారు. జనాల చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది. స్మార్ట్ గా వారి ఆలోచనలు మారుతున్న వేళ సింపతీ కార్డు కోసం టీడీపీ ప్రయోగించినా లేక తానుగా ఆమె భర్త కోసం వచ్చినా కూడా అది జనంలోకి ఎక్కేది పెద్దగా ఉండదనే అంటున్నారు. భూవనేశ్వరి బాధ ఇంటి బాధ, అది ప్రపంచ బాధగా మారాలీ అంటే చేయాల్సింది చాలా ఉంది అని అంటున్నారు. కానీ తొలి అడుగులే తడబడిపోయిన టీడీపీ ఇపుడు లేట్ గా ఆమెను తీసుకువచ్చి చేసేది ఏమి ఉంటుంది అని అంటున్న వారూ ఉన్నారు.