వైసీపీ, టీడీపీ స్టార్ క్యాంపెయినర్లపై క్లారిటీ.. ఎవరంటే..!
దీంతో ఎన్నికల ప్రచారం.. దీనికి ముందు జరిగే.. తతంగం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
By: Tupaki Desk | 28 Jan 2024 1:30 AM GMTవచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న టీడీపీ, వైసీపీలు.. పట్టుదలతో ముం దుకు సాగుతున్నాయి. రెండోసారి వరుసగా విజయం దక్కించుకుని అధికారంలోకి రావడం ద్వారా రికార్డు సృష్టించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఇక, తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాలను ఎదిరించేందుకు.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు.. అధికారంలోకి వచ్చితీరాలనే సంకల్పంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పోటీ చాలా టఫ్‌గా మారనుందనే సంకేతాలు వస్తున్నాయి.
దీంతో ఎన్నికల ప్రచారం.. దీనికి ముందు జరిగే.. తతంగం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రచారం చాలా కీలకంగా మారనుంది. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ, ప్రస్తుత జగన్ పాలనా వైఫల్యాలను టీడీపీ ప్రజాక్షేత్రంలోని ఇప్పటికే తీసుకువెళ్తున్నాయి. వీటికి మరింత ఊపు తెచ్చేందుకు సహజంగానే పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను ఎంచుకుంటాయి. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీలకు కూడా స్టార్ క్యాంపెయినర్లు అవసరం అవుతారు.
గత ఎన్నికల్లో వైసీపీకి వైఎస్ షర్మిల, జగన్ మాతృమూర్తి విజయమ్మలు.. స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. వీరికితోడు కొన్ని నియోజకవర్గాల్లో మోహన్‌బాబు, అలీ. వంటివారు కూడా.. ప్రచారంలో దూకుడు చూపించారు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. బాలయ్య కొంత వరకు మేనేజ్ చేశారు. సినిమా రంగం నుంచి పెద్దగా ఎవరూ రాకపోయినా.. ప్రదానంగా చంద్రబాబే ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. వైసీపీ ప్రచారాన్ని జగన్.. ఆయన కుటుంబం మోసింది. ఆయన సతీమణి భారతి కూడా.. పులివెందుల సహా కడపలో ఇంటింటి ప్రచారం చేశారు.
ఇక, ఇప్పుడు ఈ రెండు పార్టీలకూ స్టార్ క్యాంపెయినర్లు ఎవరు ? అనేది ఆసక్తిగా మారింది. వైసీపీకి ప్రత్యేకంగా ఎవరూ లేరు. గత ఎన్నికల్లో వచ్చిన షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్ కమ్ చీఫ్ అయ్యారు. దీంతో వైసీపీకి జగనే స్టార్ క్యాంపెయినర్‌గా వస్తున్నారు. ఇతర సినీ తారలు మాత్రం అక్కడక్కడ ప్రచారం చేయనున్నారు. ఇక, చంద్రబాబు విషయానికి వచ్చినా.. పరిస్థితి అలానే ఉంది. పొత్తులో భాగంగా పవన్.. ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇతర తారలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. సో.. మొత్తంగా చూస్తే.. టీడీపీకి చంద్రబాబు, వైసీపీకి జగన్‌లే స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించ నున్నారని తెలుస్తోంది.