గిన్నిస్ రికార్డ్ దిశగా కుంభమేళా... భక్తుల విషయంలో కాదు!
చివరిరోజు కూడా కావడంతో తాకిడి ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. మరోపక్క.. గిన్నిస్ రికార్డ్ దిశగా ఇక్కడ ఓ కార్యక్రమం జరగనుంది.
By: Tupaki Desk | 25 Feb 2025 5:53 AM GMTఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్లుగా ఈ మహా కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ పవిత్ర త్రివేణి సంగమంలో సుమారు 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెబుతున్నారు.
ఈ నెల 26వరకూ ఈ మహాకుంభమేళా కార్యక్రమం కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో.. చివరిరోజు కూడా కావడంతో తాకిడి ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. మరోపక్క.. గిన్నిస్ రికార్డ్ దిశగా ఇక్కడ ఓ కార్యక్రమం జరగనుంది.
అవును... ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకూ సుమారు 60 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది! ఈ నేపథ్యంలోనే గిన్నీస్ రికార్డ్ లక్ష్యంగా పారిశుధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ ను నిర్వహించారు.
ఇందులో భాగంగా... సుమారు 15 వేల మంది కార్మికులు చీపురు పట్టి ఈ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్ రాజ్ మేయర్, మహా కుంభమేళా ప్రత్యేక ఈవో పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా... 2019లో ప్రయగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాలో 10వేల మంది పారిశుధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి 15వేల మంది పారిశుధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు!