Begin typing your search above and press return to search.

దారిలోకి రావడంలేదా? దారికి తెచ్చే ప్రయత్నమా.. ఇక ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్ మార్చారు. 4.0 ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎమ్మెల్యేల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   1 March 2025 4:00 PM IST
దారిలోకి రావడంలేదా? దారికి తెచ్చే ప్రయత్నమా.. ఇక ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్ మార్చారు. 4.0 ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎమ్మెల్యేల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారం శాశ్వతమని భ్రమపడవద్దని, ప్రజలు, క్యాడరుకు దగ్గరగా మసులుకోవాలని పదేపదే చెబుతున్నారు.

కూటమి పార్టీల ఎమ్మెల్యేల భేటీ అయినా, టీడీఎల్పీ సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు తన వద్ద ఉన్న సమాచారంతో క్లాసు పీకుతూనే ఉన్నారు. అయితే 9 నెలలుగా ఆయన చెబుతున్నా, కొందరి వైఖరిలో మార్పు రాకపోవడంతో ఇప్పుడు చంద్రబాబే రూటు మార్చారు. ఇక నుంచి ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్ మీటింగులు ఉంటాయని టీడీపీఎల్పీ భేటీలో సంకేతాలిచ్చారు.

ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయడంపై కూటమిలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకుని తమ నియోజకవర్గాలకు అవసరమైన నిధులు సాధించుకునే అవకాశం ఉందని ఎక్కువ మంది సంబర పడుతుండగా, కొద్ది మందిలో మాత్రం దడ మొదలైందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో తలంటుతున్న సీఎం చంద్రబాబును ఇకపై ఫేస్ టు ఫేస్ భేటీలో ఎదుర్కోగలమా? అని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేస్తూనే ఉన్నారు. అధికారం తలకెక్కించుకోవద్దని, వివాదాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ, కొందరి విషయంలో ఆరోపణలు వెల్లువెత్తడం, క్యాడరుతో గ్యాప్ పెరిగిపోతుండటంతో సీఎం ఇన్నాళ్లు చేస్తున్న సూచనలు ఏవీ పనిచేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు రూటు మార్చారని అంటున్నారు. అందరితో కలిపి చెబితే ఎవరూ మారడం లేదని, సీఎం హెచ్చరికలు తమకు కాదని ధీమా ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న సీఎం.. వారితో ముఖాముఖి భేటీలు నిర్వహించి ప్రాగ్రెస్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు క్యాడరుకు.. క్యాడరుకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిపోతోందని సీఎం భావిస్తున్నారంటున్నారు.

ఇదే విషయాన్ని టీడీఎల్పీ భేటీలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగాలని దిశానిర్దేశం చేశారు. అదేసమయంలో కొన్నిచోట్లు ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు పెరగడాన్ని కూడా సీఎం సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. అటువంటి నియోజకవర్గాలు, ప్రజాప్రతినిధులను గుర్తించి తానే స్వయంగా మాట్లాడాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. 9 నెలల పాలన కాలంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత జాగ్రత్త వహిస్తున్నారని అంటున్నారు.