విజన్ 2047లో ప్రతి ఒక్కరూ భాగస్వాములే: చంద్రబాబు
విజన్ -2047లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
By: Tupaki Desk | 17 March 2025 5:32 PM ISTవిజన్ -2047లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం.. ఆయన విజన్-2047 అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. వచ్చే 2047 నాటకి ఏపీని సంపూ ర్ణ అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. 1995లో తాను విజన్ 2020 ప్రకటన చేసినట్టు వివరించారు. అయితే.. అప్పట్లో అందరూ తన విజన్‌ను విమర్శించారని తెలిపారు.
కానీ, ఇప్పుడు హైదరాబాద్‌కు ఆదాయం వస్తున్నా.. ప్రజల ఆదాయం పెరిగిందన్నా.. విజన్-2020నే కారణమని చంద్రబాబు వివరించారు. దానిని పక్కాగా అమలు చేయడం వల్లే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అబివృద్ది చెందినట్టు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు 2047 విజన్‌ను ప్రకటిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ వచ్చే మూడేళ్లలో దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఒక విజన్ డాక్యుమెంటు ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఒక డాక్యుమెంటు ఉంటుందన్నారు. దీనిని అమలు చేసే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా పెట్టుబడి దారులను బెదిరిస్తే.. ఎవరూ రారని చెప్పారు.
పరిశ్రమలను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించి.. సంపద సృష్టించి.. తల సరి ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. 2029 నాటికి.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాలు నీరు లేక.. ఇబ్బందులు పడుతున్నాయని.. మరోవైపు నీరు ఉండి కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు.. అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని చెప్పారు. విజన్ 2047 ద్వారా.. ఆయా జిల్లాలను అభివృద్దిలో ముందుకు నడిపిస్తామని తెలిపారు.