సోషల్ సైకోలకు చంద్రబాబు హెచ్చరిక.. ఆడబిడ్డలను ట్రోల్ చేస్తే అదే చివరి రోజంటూ వార్నింగ్
సోషల్ మీడియాలో విచ్చలవిడి పోస్టింగులతో చెలరేగిపోతున్న సైకోలకు ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 11 April 2025 10:02 AMసోషల్ మీడియాలో విచ్చలవిడి పోస్టింగులతో చెలరేగిపోతున్న సైకోలకు ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా నేరస్థులకు అడ్డాగా మారిపోతోందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనలో చండశాసనుడిని చూస్తారంటూ హెచ్చరించారు. ఎవడైనా సరే ఆడబిడ్డల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు అవుతోందని ఘాటుగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సోషల్ మీడియా సైకోలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడారు. ఎప్పుడూ శాంతంగా ఉండే చంద్రబాబు తనలో చండ శాసనుడిని తట్టి లేపొద్దంటూ వార్నింగ్ ఇవ్వడం వైరల్ అవుతోంది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఏలూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు, కుల వృత్తిదారుల ఇళ్లకు వెళ్లారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించి ప్రజలతో ముఖాముఖిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్రస్తావనకు రావడంతో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
‘‘ఇటీవల కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టింగులు పెట్టేవారికి అదే చివరి రోజు అవుతుందని గుర్తించుకోండి. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయింది. ఎవడైనా సరే మహిళలపై తప్పుడు ప్రచారం, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు అవుతుంది’’ అంటూ సీఎం వార్నింగ్ ఇవ్వడం ఆకట్టుకుంది. మాజీ సీఎం జగన్ సతీమణిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తన పార్టీ కార్యకర్తను అరెస్టు చేయించిన చంద్రబాబు.. మొత్తం సోషల్ మీడియాను ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తే తన వాళ్లైనా శిక్ష అనుభవించాల్సిందేనని సంకేతాలిస్తూ, ఇకపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన వైఖరి ఉంటుందని తేల్చిచెప్పారు.