Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ ప్రోగ్రాంలో ప్రముఖంగా కొండా సురేఖ.. క్లారిటీ కోసమేనా?

అందులో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరు కావటమే కాదు.. ప్రోగ్రాంలో హైలెట్ గా నిలిచేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపించింది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 4:45 AM GMT
సీఎం రేవంత్ ప్రోగ్రాంలో ప్రముఖంగా కొండా సురేఖ.. క్లారిటీ కోసమేనా?
X

సానుభూతి పొంగి పొర్లే అవకాశం ఉన్న వేళలో.. దాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకునే వ్యూహానికి విరుద్ధంగా ఎక్కడ లేని విమర్శలకు తావిచ్చేలా చేసుకునే నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. కోపం వచ్చినా.. ప్రేమ వచ్చినా ఆమెను ఆపటం సాధ్యం కాదు. తనను ఉద్దేశించి ఇష్టారాజ్యంగా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే వారిని వదిలిపెట్టకూడదన్న కోపంతో కూడిన కసి. .ఆమె మాటల్లో బ్యాలెన్సును తప్పేలా చేశాయి. దీనికి తోడు.. ఆ మాటల వెనుక.. సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని బలంగా నమ్మటం మరో సమస్య.

మొత్తంగా ఆమె తన నోటికి పని చెప్పారు. తన మాటల దాడి కేటీఆర్ వరకు పరిమితం చేసినా పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా మధ్యలో సినీనటుడు నాగార్జున.. ఆయన కుమారుడు నాగచైతన్యనను.. సినీ నటి సమంతను తీసుకొచ్చారు. అవసరం లేని.. అసందర్భమైన విషయాన్ని సందర్భానికి అతికించే ప్రయత్నం చేశారు. అది కాస్తా బెడిసి కొట్టింది. దీనికి తోడు టైం కూడా ఆమెకు శత్రువైంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. ఎవరెన్ని మాటలు మాట్లాడినా.. ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటికి కాదనే దమ్ము.. ధైర్యం లేని పరిస్థితి. అందుకే.. ఆయన మాటలు నచ్చని వారు.. ఆయన కారణంగా మాటలు పడినోళ్లు సైతం మౌనంగా ఉండిపోయారు.

కానీ.. రేవంత్ ప్రభుత్వంలో భిన్నమైన సీన్ ఉంది. తమది ప్రజాప్రభుత్వమని చెప్పటమే కాదు.. చేతల్లోనూ అదే విషయాన్ని చేసి చూపిస్తున్నారు. కేటీఆర్.. హరీశ్.. ఈటల లాంటి సీనియర్ నేతలు వరుస పెట్టి విరుచుకుపడుతున్నా.. మాటకు మాటే ఉంటుందే తప్పించి.. ప్రతీకార చర్యల మాట కనిపించని పరిస్థితి. మారిన తెలంగాణలో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ హర్షించని రీతిలో కొండా సురేఖ నోటి నుంచి వచ్చిన మాటలు.. మంటలుగా మారటం పెద్ద విషయం కాదు.

గతంలో మరే వివాదం తెర మీదకు వచ్చినా.. చిత్రప్రముఖులు ఎవరూ ఇంత కలిసికట్టుగా రియాక్టు అయ్యింది లేదు. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం పెద్ద ఎత్తున రియాక్టు అయ్యారు. నాగ్ ఫ్యామిలీ అయితే ఏకంగా ప్రియాంక గాంధీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి. దీంతో.. కొండా సురేఖకు మంత్రి కొలువు ఊడిపోతుందని.. ఆమె మాజీ అయ్యే రోజు దగ్గరకు వచ్చేసిందన్న వాదనల జోరు పెరిగింది. ఈ ఎపిసోడ్ మొత్తంలో ముఖ్యమంత్రి రేవంత్ అస్సలు రియాక్టు కాలేదు. కామ్ గా ఉండిపోయారు. అయితే.. కొండా సురేఖకు మంత్రి పదవి పోతుందన్న ప్రచారానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేయాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అందులో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరు కావటమే కాదు.. ప్రోగ్రాంలో హైలెట్ గా నిలిచేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపించింది. దీంతో.. కొండా సురేఖకు ఈసారికి క్షమాభిక్ష లభించినట్లుగా చెబుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా చిత్ర పరిశ్రమలోని పలువురు ఒకే తాటి మీద ఉన్నప్పుడు.. తమ మంత్రి విషయంలో తాము కూడా అంతే ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్న భావనకు ముఖ్యమంత్రి రేవంత్ వచ్చారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.