టీమిండియా జెర్సీలపై ఆ సీఎం విమర్శలు
ఈ సందర్భంగా టీమిండియా గెలవాలని రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ ఆకాంక్షిస్తున్నారు.
By: Tupaki Desk | 18 Nov 2023 4:12 PM GMTవన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఇలా అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తూ టీమ్ ఇండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ నకు అడుగు దూరంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ లోకి అడుగు పెట్టారు. 5 సార్లు టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియాతో భారత జట్టు రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తుది పోరుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా టీమిండియా గెలవాలని రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లు కప్పు సాధిస్తారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాక్టీస్ సెషన్ల సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు కాషాయ రంగు జెర్సీలు ధరించడంపై దీదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రికెట్ ను కూడా కాషాయీకరించడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెల్లిందని దీదీ విమర్శలు గుప్పించారు. ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తుందని, మనవాళ్లు కప్పు గెలవడం ఖాయమని అందరం నమ్ముతున్నామని అన్నారు.
అయితే, బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశంలోని వివిధ సంస్థలతోపాటు టీం ఇండియాని కూడా కాషాయీకరించే ప్రయత్నం చేస్తుందని దీదీ ఆరోపించారు. ఆఖరికి మెట్రో స్టేషన్లకు సైతం కాషాయం రంగు వేస్తున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. వాస్తవానికి గతంలో టీమిండియా ఆటగాళ్లు మైదానంతో పాటు ప్రాక్టీస్ సందర్భంగా కూడా బ్లూ జెర్సీనే ధరించేవారు. అయితే, కొంతకాలంగా మాత్రం మైదానంలో మెన్ ఇన్ బ్లూ గా కనిపిస్తున్నప్పటికీ ప్రాక్టీస్ సందర్భంగా మెన్ ఇన్ ఆరెంజ్ గా మారిపోతున్నారు.
ఈ వ్యవహారంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో మమత బెనర్జీ వంటి నేత విమర్శలు చేయడం ఇదే తొలిసారి. మరి ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలోనే జట్టు కాషాయీకరణకు ప్రయత్నం జరుగుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే