Begin typing your search above and press return to search.

'ఈ వేదిక నుంచే సీఎం'.. మోడీ వ్యాఖ్య‌ల మ‌ర్మం అదేనా..!

వీరితోపాటు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా వ‌చ్చారు. అయితే.. వేదిక‌పై ఉన్న వారిలో బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఒక్క బండి సంజ‌య్ మాత్ర‌మే.

By:  Tupaki Desk   |   8 Nov 2023 7:14 AM GMT
ఈ వేదిక నుంచే సీఎం.. మోడీ వ్యాఖ్య‌ల మ‌ర్మం అదేనా..!
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి స్వ‌యంగా హాజ‌రయ్యారు. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. ఈ విష‌యం అలా ఉంచితే.. చివ‌రిగా మోడీ చేసిన వ్యాఖ్య ఇటు బీజేపీలోనూ.. అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ``ఈ వేదిక నుంచే మీకు బీసీ సీఎం రాబోతున్నాడు!`` అని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నిజానికి ఎల్బీ స్టేడియం వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోపాటు తెలంగాణ పార్టీచీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి, ఎంపీ బండి సంజ‌య్ ఉన్నారు. వీరితోపాటు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా వ‌చ్చారు. అయితే.. వేదిక‌పై ఉన్న వారిలో బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఒక్క బండి సంజ‌య్ మాత్ర‌మే. దీంతో ప్ర‌ధాన మంత్రి చేసిన వ్యాఖ్య ఆయ‌న గురించేనా ? అనే చ‌ర్చ సాగుతోంది. చెప్ప‌క‌నే సీఎం అభ్య‌ర్థి విష‌యాన్ని చెప్పేశారా? అనేది చ‌ర్చ‌.

గ‌త కొన్నాళ్లుగా తెలంగాణ‌లో సీఎం అభ్య‌ర్థి విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని.. బీఆర్ ఎస్‌ను ఓడగొట్టి.. అధికారం ద‌క్కించుకుంటామ‌ని చెబుతున్న క‌మ‌లం నేత‌లు ఆది శ‌గా కొన్నాళ్లు బాగానే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే చేరిక‌లు, కండువాలు క‌ప్ప‌డాలు కూడా జ‌రుగుతున్నాయి. ఇక‌, సీఎం సీటు విష‌యంలో మాత్రం ఆది నుంచి రెడ్డి వ‌ర్గం పోటీ ఇస్తోంది.

కానీ, అనూహ్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా వ‌చ్చి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటే బీసీని ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. మెజారిటీ నాయ‌కుల చూపు బండి పై ప‌డింది. కాబోయే సీఎం సంజ‌యేన‌ని గుస‌గుస జోరుగానే వినిపించింది. అయితే.. దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో నాయ‌కులు మౌనంగా ఉన్నారు. తాజాగా మోడీ..`ఈ వేదిక నుంచి బీసీ సీఎం రాబోతున్నా డు`` అని చెప్ప‌డం వెనుక బండిని ఉద్దేశించే ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అంటున్నారు.