తారాస్థాయికి జగన్... నయా అంటరానితనంపై నిప్పుల వర్షం!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
By: Tupaki Desk | 20 Jan 2024 9:34 AM GMTవైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్" ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. న భూతో న భవిష్యతి అన్నస్థాయిలో విజయవాడ నడిబొడ్డున సరికొత్త చరిత్రకు నాంధి పలికారు జగన్. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రతీఒక్కరినీ ఆలోచింపచేస్తుంది.
అవును... విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ ప్రసంగం అత్యంత ఆలోచనాత్మకంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు, పరిశీలకులు. ప్రధానంగా "నయా అంటరానితనం"పై జగన్ చెప్పిన వ్యాఖ్యలు, చేసిన విమర్శలు సమాజంలో సరికొత్త ఆలోచనలకు నాంధి పలికిందని చెబుతున్నారు.
"ఒకనాడు మన సమాజంలో ప్రబలంగా ఉండే అంటరానితనం ఇప్పుడూ ఉంది.. కాకుంటే అది రూపు మార్చుకుంది.. వేరే రూపంలో అది సమాజాన్ని కాల్చుకుతింటోంది" అంటూ సీఎం జగన్ చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది.. ప్రజలను ఆలోచింపచేస్తుంది.. విమర్శకుల ప్రశంసలందుకుంటుంది. ఈ సందర్భంగా నాటి సమాజంలో పేదలకు మేలు జరుగుతుంటే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఆయన ఇచ్చిన క్లారిటీ ఆసక్తిగా మారింది.
ఇందులో భాగంగా... "పేదలు చదివే స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే.. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఓర్చుకోలేకపోవడం అంటరానితనమే.. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం అంటరానితనమే.. పేదలు ప్రయాణించే ఆర్టీసీని, పేద ప్రజల ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం కూడా అంటరానితనమే".. అంటూ రాష్ట్రంలో పెత్తందారి వ్యవస్థను జగన్ ఎండగట్టిన తీరు ఇప్పుడు సమాజంలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!
ఇదే సమయంలో... "పేద పిల్లలకు ట్యాబ్ లు ఇస్తుంటే వికృత వార్తలు రాయడం అంటరానితనమే.. కొన్నీ మీడియా సంస్థలు వెనుకబడిన వర్గాల ప్రజల ఎదుగుదలను సహించలేకపోతున్నాయి" అని స్పందించిన జగన్... "పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా?" అని నిలదీస్తూ... "ఇలాంటి ఆలోచనలు కూడా అంటరానితనమే" అని విరుచుకుపడ్డారు. దీంతో ఇవి సమాజంలో బడుగు బలహీన వర్గాలను ఆలోచింపచేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఈ విధంగా నయా అంటరానితనంపై తనదైన విశ్లేషణ అందించిన జగన్.. ఈ నయా అంటరానితనాన్ని ఒకవర్గం మీడియా ప్రోత్సహిస్తుందంటూ నిప్పులు చెరిగిన జగన్.. అనంతరం బడుగు బలహీనవర్గాలకు భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా... "మీ కోసం నేనున్నాను.. మీకు అండగా నేనుంటాను.." అని అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన మార్పును వివరించారు.
ఇందులో భాగంగా "మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే బలహీనవర్గాలకు రాజకీయ ప్రాధాన్యం దక్కింది.. ఇందులో భాగంగా శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే, ఎనిమిది మందిని రాజ్యసభకు పంపింతే అందులో సగం ఎస్సీ, బీసీలే..13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీన వర్గాల వారే" అని చెబుతూ... వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి జగన్ వివరించారు.
అనంతరం... "అంబేద్కర్ అంటే పెత్తందారులకు అసహ్యం.. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదు.. పెత్తందారి పార్టీలకు, పెత్తందారీ నేతలకు దళితులంటే చులకన.. అంబేద్కర్ స్ఫూర్తితోనే అందరినీ ఒక్కతాటిపై నిలబెడుతున్నాం.. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది.. మరోపక్క సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోంది" అని జగన్ ప్రసంగించారు.
ఇలా... దళితజాతికి, బహుజన సమాజానికీ అభినందనలు తెలియజేస్తూ జగన్ చేసిన ప్రసంగంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. దీంతో... తన బలానికి, తన బలగానికీ జగన్ ఈ ఒక్క ప్రసంగంతో మరింత దగ్గరైపోయారనే మాటలు రాజకీయ విశ్లేషకులు, సామాజిక పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి!