Begin typing your search above and press return to search.

జగన్‌ ఢిల్లీ పర్యటన.. టీడీపీలో కలవరం!

గతంలో తరచూ జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు, తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపై ఉన్న హత్యాయత్నం కేసును కొట్టేయించుకోవడానికే బీజేపీ పెద్దలను కలుస్తున్నారని టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించేవారు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 8:25 AM GMT
జగన్‌ ఢిల్లీ పర్యటన.. టీడీపీలో కలవరం!
X

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక కేసు వెంట మరొకటి వరుసగా పలు కేసులను ఆయనపై మోపారు. మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కు పలు కేసుల్లో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ శ్రేణులతోపాటు జనసేన పార్టీ, సీపీఐ ఆరోపిస్తున్నాయి. సీపీఐ అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఉందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. గతంలో తరచూ జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు, తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపై ఉన్న హత్యాయత్నం కేసును కొట్టేయించుకోవడానికే బీజేపీ పెద్దలను కలుస్తున్నారని టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించేవారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల వద్దకు జగన్‌ తరచూ కేసులు కొట్టేయించుకోవడానికే వెళ్తున్నారని ఆరోపించేవారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత తొలిసారి వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని బీజేపీ పెద్దలకు జగన్‌ వివరిస్తారని టాక్‌ నడుస్తోంది. అంతేకాకుండా ఈ విషయంలో తమకు అండగా నిలవాలని, తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ పెద్దలను జగన్‌ కోరతారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు సైతం నమ్ముతున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వీటిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కుంభకోణం, ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం, స్కిల్‌ డెవలప్మెంట్‌ కుంభకోణం జరిగాయని జగన్‌.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలకు వివరిస్తారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా చెబుతుండటం గమనార్హం. చంద్రబాబు, ఆయన కుమారుడిపై ఉన్న కేసులపై చర్చించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియా కథనాలు అల్లుతోంది. ప్రధాని, అమిత్‌ షాల ఆమోదంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని.. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విడిచిపెట్టబోరని చెబుతోంది.

కేవలం కొన్ని కేసులే కాకుండా చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పలు కేసులను జగన్‌ ప్రభుత్వం సిద్ధం చేసుకుందని టీడీపీ అనుకూల మీడియా పేర్కొంటోంది. ఈ కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో జగన్‌ చర్చలు జరుపుతున్నారని వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్‌ ఢిల్లీ పర్యటన టీడీపీలో కలవరానికి కారణమవుతోందని చర్చ జరుగుతోంది.