Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేంద్రం మెడలు వంచే ఫార్ములా ఇదేనట

తెలుగు బెల్టుగా అభివర్ణించే ప్రాంతంలో తప్పించి.. ఆ రాష్ట్రం మొత్తమ్మీదా కేసీఆర్ చూపించే ప్రభావం చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:52 AM GMT
కేసీఆర్ కేంద్రం మెడలు వంచే ఫార్ములా ఇదేనట
X

కేంద్రాన్ని మెడలు వంచేస్తామంటూ పదే పదే చెబుతున్న కేసీఆర్ మాటలకు లాజిక్ ఎక్కడిది? అన్న ప్రశ్న తరచూ తెర మీదకు వస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్నది 17 సీట్లు. ఆ చిన్న మొత్తంతో గులాబీ బాస్ ఏం చేయగలరు? ఉన్న సీట్లలో నాలుగైదు సీట్లు విపక్షాలకు పోగా.. మిగిలిన సీట్ల తో ఆయన చూపే ప్రభావం అంతంతే కదా? అన్న మాట వినిపిస్తోంది. అయితే.. కేసీఆర్ లెక్కలు వేరుగా ఉన్నాయి. తన అంచనాల గురించి లెక్కల గురించి ఆయన తాజాగా చెప్పుకొచ్చారు.

తెలంగాణలో పదిహేడు.. మహారాష్ట్రలో 48 సీట్లు కలుపుకొని.. మొత్తంగా 65 సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. కేంద్రం మెడలు వంచేలా చేయలేమా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను చెప్పిందే జరిగితే.. బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉండదని.. తద్వారా దేశానికి నేత్రత్వం వహించే వీలుందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలు విన్నంతనే నిజమే కదా? అనిపిస్తాయి. కానీ.. లోతుల్లోకి వెళితేనే.. ఆయన మాటల అర్థం ఎంతన్నది అర్థం కాదు.

తాజా లెక్కల్నే తీసుకుంటే.. తెలంగాణలో ఉన్న 17 సీట్లలో ఒకటి మిత్రపక్షమైన మజ్లిస్ కు పోగా.. మిగిలిన 16 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్ల సంఖ్య సింగిల్ డిజిట్ దాటదన్న మాట వినిపిస్తోంది. అదే.. మహారాష్ట్ర విషయానికి వస్తే. .తెలుగు బెల్టుగా అభివర్ణించే ప్రాంతంలో తప్పించి.. ఆ రాష్ట్రం మొత్తమ్మీదా కేసీఆర్ చూపించే ప్రభావం చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సాధన వేళ.. సీమాంధ్రుల పేరు చెప్పి సెంటిమెంట్ రగిలించిన కేసీఆర్.. తాజాగా చూస్తే.. అంబానీ.. ఆదానీలకు మోడీ సర్కారు భారీగా కట్టబెడుతుందన్న వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిల్వ ఉన్న 361బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో 150 ఏళ్లు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా.. ఇండోనేషియా నుంచి కొనుగోలు ఎందుకు చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులు పెంచేందుకు అంబానీ.. ఆదానీలకు అప్పగిస్తున్నట్లుగా ఆయన ఆరోపించారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ కాలు మోపినప్పటి నుంచి విద్యుత్ కోతలు ఎత్తేశారని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ అమలు చేయాలని చెప్పిన కేంద్రేకర్ అనే ఐఏఎస్ అధికారిని ముఖ్యమంత్రి.. మంత్రులు బెదిరించి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు. సాగునీరు లేక మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న కేసీఆర్.. ఆ రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు.

విషయం ఏదైనా సెంటిమెంట్ రగిలించే విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు ఏ రీతిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను పవర్ లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారిందే తప్పించి.. లాభపడుతున్న.. లబ్థి చెందుతున్న వారిలో అత్యధికులు ఎవరు? సీమాంధ్ర వ్యాపార వర్గాల వారే కదా? అన్నదిప్పుడు ప్రశ్న. మరి.. దీనికి కేసీఆర్ ఏం చెబుతారో?