కీలక సీటుపై కన్నేసిన సీఎం!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 20 March 2024 5:40 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి ఆరు పార్లమెంటు సీట్లు, పది అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. అయితే ఇంతవరకు బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలపై స్పష్టత రాలేదు.
మరోవైపు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అంచనాలున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నేతలు పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించారు. ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులు కావాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో కీలక నియోజకవర్గాలపై బీజేపీ నేతలు కన్నేశారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. సీఎం రమేశ్ రెండుసార్లు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యాక ఆయన బీజేపీలో చేరారు. రమేశ్ తోపాటు నాడు టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరిపోయారు.
సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ రాజ్యసభ పదవీకాలం ఇప్పటికే పూర్తయింది. సీఎం రమేశ్ పదవీకాలం మాత్రం ఏప్రిల్ 2 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన లోక్ సభకు పోటీ చేయడంపై దృష్టి సారించారు. అయితే రాయలసీమకు చెందిన సీఎం రమేశ్ బీజేపీ పోటీ చేస్తుందని భావిస్తున్న రాజంపేట నుంచి కాకుండా అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తుండటమే హాట్ టాపిక్ గా మారింది.
ఈ మేరకు ఇప్పటికే అనకాపల్లిలో సీఎం రమేశ్ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు కావడం గమనార్హం. వాస్తవానికి తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే ఇందులో తిరుపతి ఎస్సీ రిజర్వుడ్ సీటు. ఇక రాజంపేట ఎంపీ స్థానంలో వైసీపీ చాలా బలంగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ మెజారిటీలతో రాజంపేటలో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున ఆయనే పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పేరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాజంపేటలో ఆర్థిక, అంగ బలాలు మెండుగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయంతోనే సీఎం రమేశ్ ఉత్తరాంధ్రపై దృష్టి సారించారని అంటున్నారు. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లిలో సీఎం రమేశ్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.
వాస్తవానికి సీఎం రమేశ్ బంగారు బాతుగుడ్డులాంటి విశాఖపట్నం ఎంపీ స్థానంపైనే కన్నేశారు. అయితే ఈ సీటు నుంచి టీడీపీయే పోటీ చేయాలని భావిస్తోంది. ఇక్కడ ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధినేత భరత్ బరిలోకి దిగనున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ 4 వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయననే బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ అనకాపల్లి సీటుపై కన్నేశారు. ఆయన పేరుతో బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలతో హడావుడి చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ అని రచ్చ షురూ చేశాయి. మరోవైపు నాన్ లోకల్స్ కు సీటు ఇవ్వొద్దని కొంతమంది బీజేపీ అధిష్టానం వద్ద తమ డిమాండ్ వినిపిస్తున్నారని తెలుస్తోంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ కు సీటు దక్కుతుందో, లేదో వేచిచూడాల్సిందే.