Begin typing your search above and press return to search.

విశాఖను టార్గెట్ చేసిన సీఎం రమేష్ !

టీడీపీ బీజేపీ పొత్తు ఉంటే కనుక విశాఖ సీటు రమేష్ కి దక్కుతుందని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:18 PM GMT
విశాఖను టార్గెట్ చేసిన సీఎం రమేష్  !
X

తెలుగుదేశం పార్టీ అండతో రాజ్యసభకు వెళ్ళి 2019లో ఆ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే బీజేపీలో చేరిన ఎంపీలలో సీఎం రమేష్ ఒకరు. ఈ ఏడాది ఏప్రిల్ 2తో ఆయన పదవీకాలం పూర్తి అవుతోంది. ఆయన లోక్ సభ నుంచి పోటీ చేయడం ఒక్కటే మార్గం. సీఎం రమేష్ వంటి అర్ధబలం అంగబలం ఉన్న వారికి టికెట్ తప్పకుండా కమలం పార్టీ ఇస్తుంది.

ఆయనది కడప జిల్లా. అక్కడ రెండు సీట్లు ఉన్నాయి. కడప, రాజంపేటలలో ఏదో ఒక దాన్ని ఆయన ఎంచుకుని పోటీ చేయవచ్చు. బలమైన సామాజిక వర్గం కూడా ఆయనకు ఉంది. కానీ సీఎం రమేష్ మాత్రం తనకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ వైపు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది.

విశాఖ ఎంపీ సీటు నుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు అని అంటున్నారు. విశాఖ కడపల మధ్యన చాలా దూరం ఉంది. ప్రాంతాలు కూడా వేరు. యాస భాష అంతా వేరు. కానీ అన్నింటినీ కలిపేది మాత్రం రాజకీయం. అందుకే విశాఖ నుంచి పోటీకి ఆయన సిద్ధపడుతున్నారు అని అంటున్నారు.

విశాఖ ఎంపీ సీటు అంటేనే వలస నేతలకు రాజ భోజ్యం అని చరిత్ర చెబుతోంది. విశాఖ నుంచి ఎందరో ఇతర ప్రాంతాలకు చెందిన వారు గెలిచారు. నెల్లూరు నుంచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి. టి సుబ్బరామిరెడ్డి, ఆ పక్కనే ఉన్న ఒంగోలు నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు వంటి వారు విశాఖ ఎంపీలు అయ్యారు. అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన ఎంవీవీఎస్ మూర్తి కూడా విశాఖ ఎంపీ అయ్యారు. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా గోదావరి జిల్లాలకు చెందినవారే.

ఇలా గత నాలుగు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ సీటు వలస పక్షులకు ఆలవాలమైంది. అందుకే ఆ ధైర్యంతోనే సీఎం రమేష్ వంటి వారు విశాఖ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ బీజేపీ పొత్తు ఉంటే కనుక విశాఖ సీటు రమేష్ కి దక్కుతుందని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు రమేష్ సన్నిహితులు అన్నది తెలిసిందే. బీజేపీ నుంచి ఓకే అనిపించుకుంటే విశాఖ సీటు రమేష్ కి కేటాయించేందుకు కూడా బాబుకు అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న రమేష్ ఎంపీ అయితే టీడీపీకి కూడా అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీగానే అండ దొరుకుతుంది అని అంటున్నారు.

అయితే ఈ సీటు విషయంలో దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ప్రయత్నం చేస్తున్నారు అలాగే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా చూస్తున్నారు. వీరితో పాటు ఇపుడు రమేష్ కూడా పోటీకి వస్తున్నారు. విశాఖలో కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటన నేపధ్యంలో విశాఖ పుర వీధులలో రమేష్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. దాంతో రమేష్ కి విశాఖ రాజకీయాల మీద ఆసక్తి కలిగింది అని అనుకుంటున్నారు. పొత్తులు ఉంటే కనుక రమేష్ విశాఖను గట్టిగానే టార్గెట్ చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.