Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్.. మంత్రుల సింక్ మామూలుగా లేదట

మంత్రులుగా ఉన్న సీనియర్ నేతల్ని కలుపుకుపోయే విషయంలో రేవంత్ తీరుపై బోలెడన్ని అనుమానాలు ఉండేవి.

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:30 PM GMT
సీఎం రేవంత్.. మంత్రుల సింక్ మామూలుగా లేదట
X

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నంతనే చాలామంది నోటి నుంచి వినిపించే మాట.. ఇక రోజూ రాజకీయ రణరంగమేనని. అధిపత్య పోరు.. తాము గొప్పంటే తాము గొప్పన్నట్లుగా వ్యవహరించటంతో పాటు.. తమకున్న అంతర్గత స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవటంలో వారు ముందు ఉంటారన్న విమర్శ ఉంది. అంతేకాదు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవటం.. విమర్శలు చేసుకోవటం.. ఆఫ్ ద రికార్డుగా పలువురి బలహీనతల్ని బహిర్గతం చేసి.. వారి ఇమేజ్ డ్యామేజ్ చేసేలా పావులు కదపటం మామూలే.

ఇటీవల కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం సగటు కాంగ్రెస్ సర్కారుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మంత్రులుగా ఉన్న సీనియర్ నేతల్ని కలుపుకుపోయే విషయంలో రేవంత్ తీరుపై బోలెడన్ని అనుమానాలు ఉండేవి. అవన్నీ కూడా పటాపంచలు అయ్యే పరిస్థితి. ఎవరు ఎంతలా ఊరించినా.. ఎంతలా ప్రశ్నించినా.. రేవంత్ నోటి నుంచి వస్తున్న రెండు మాటలు అదే పనిగా రిపీట్ అవుతున్నాయి. మరే ముఖ్యమంత్రి ఉన్నా రేవంత్ మాదిరి వ్యవహరించారన్న మాట ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది.

ఏం ప్రశ్న అడిగినా సరే.. తన సహచర మంత్రులతో మాట్లాడి చెబుతానని.. మరింత కీలకమైన ప్రశ్నలు.. విధానపరమైన అంశాలుగా వస్తే.. హైకమాండ్ తో మాట్లాడతానని.. వారు తీసుకునే నిర్ణయాల్ని తాను అమలు చేస్తానని రేవంత్ స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో.. మంత్రుల్ని వేర్వేరుగా అడిగే విధానపరమైన అంశాలపై స్పందించాలని కోరితే.. ముఖ్యమంత్రితో చర్చించి.. తమ నిర్ణయాల్ని వెల్లడిస్తామని చెబుతున్నారు. ఇలా ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు ఒకేలాంటి సింక్ ఉండటం చాలా అరుదని.. అందునా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి సీన్ కనిపించటం చాలా తక్కువని చెబుతున్నారు. ఏమైనా.. ప్రభుత్వాన్ని కొలువు తీర్చిన మొదట్లోనే.. అత్యంత కఠినమైన పరీక్షను రేవంత్ సింఫుల్ గా నెగ్గేశారన్న మాట వినిపిస్తోంది.