Begin typing your search above and press return to search.

సీఎం సభ ఉంది.. మహిళలు రావాల్సిందే.. వైరల్ గా ఆడియో క్లిప్

వెలుగు యానిమేటర్ పేరుతో ఉన్న ఈ ఆడియోలో.. ప్రతి గ్రూపు నుంచి కనీసం నలుగురు సభ్యులు కచ్ఛితంగా రావాల్సిందేనన్న మాట బలంగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 5:08 AM GMT
సీఎం సభ ఉంది.. మహిళలు రావాల్సిందే.. వైరల్ గా ఆడియో క్లిప్
X

ఏపీ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో వ్యవహరిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా కొత్త ప్లాన్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగావైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఆ కోవలోకే వస్తుందని చెబుతున్నారు. ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో.. ఆయన రాజకీయ వ్యతిరేకులు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టటం లేదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా ఒక ఆడియోక్లిప్ వైరల్ గా మారింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 5న కాకినాడ జిల్లా సామర్లకోటకు వస్తున్నారని.. ఆ సందర్భంగా సీఎం నిర్వహించే బహిరంగ సభకు మహిళలు పెద్ద ఎత్తున రావాలన్న సందేశం వైరల్ గా మారింది. వెలుగు యానిమేటర్ పేరుతో ఉన్న ఈ ఆడియోలో.. ప్రతి గ్రూపు నుంచి కనీసం నలుగురు సభ్యులు కచ్ఛితంగా రావాల్సిందేనన్న మాట బలంగా వినిపిస్తోంది.

సీఎం సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని.. అందరూ బస్సు వద్దకు వస్తే.. తామే జాగ్రత్తగా తీసుకెళ్లి.. తిరిగి ఇంటికి చేరుస్తామన్న మాట ఉంది. వెలుగు యానిమేటర్లు తమ మహిళల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఆడియోక్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. కావాలనే ఈ తరహా ఎత్తున కొందరు వేస్తున్నారన్న కౌంటర్ విమర్శ వినిపిస్తోంది.

సామర్లకోట జగనన్న లేఅవుట్ లో ఏర్పాటు చేసిన గ్రహప్రవేశాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. కొత్తపల్లి మండలంలోని ఒక్కో యానిమేటర్ 35 స్వయం సహాయక టీంలు ఉన్నాయి. ఒక్కో టీం నుంచి నలుగురు వస్తే వంద మంది దాటిపోతారని.. మండలంలో సుమారు 50 మంది యానిమేటర్లు ఉన్నారు. ఒక్కో యానిమేటర్ వంద మందిని తీసుకొచ్చినా.. ఐదు వేల మంది మహిళల్ని సీఎం సభకు సమీకరించినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

సీఎం సభకు మహిళల్ని తరలించకపోతే.. వారు రాలేదన్న భావన కలుగజేసేందుకే ఈ తరహా ప్రచారానికి తెర తీస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమంటే.. ఇప్పటివరకు సామర్లకోటలో ఏర్పాటు చేసే సభకు సీఎం జగన్ వస్తారా? లేదా? అన్న క్లారిటీ లేదు. దీనికి తోడు అధికారికంగా ఖరారు కాలేదు. కానీ.. సీఎం వస్తారని.. ఆయన సభలకు ఇంత భారీగా మహిళలు అవసరం అంటూ జరుగుతున్న ప్రచారం చూస్తే.. ఔరా అనుకోకుండా ఉండలేం.