సంచలనం.. జనవరి 1 నుంచి పెట్రోలో.. డీజిల్ వాహనాలు కొనొద్దు!
రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొనుగోలు చేసే వాహనాలన్నీ కూడా విద్యుత్ వాహనాల్ని కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు.
By: Tupaki Desk | 1 Jan 2024 3:59 AM GMTహిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెట్రోల్.. డీజిల్ వాహనాలు కొనొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొనుగోలు చేసే వాహనాలన్నీ కూడా విద్యుత్ వాహనాల్ని కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఏవీ కూడా జనవరి 1, 2024 నుంచి సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్.. డీజిల్ తో నడిచే వాహనాల్ని కొనుగోలు చేయొద్దన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల్ని ప్రోత్సహించటంతో పాటు గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ఒకవేళ పెట్రోల్.. డీజిల్ వాహనాల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వ శాఖలు నిర్ణయిస్తే.. అందుకు ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలన్నారు.
ప్రస్తుతం హిమాచల్ రాష్ట్రంలోని ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఈ-వాహనాలు 185 వరకు ఉండగా.. ప్రైవేటు రంగంలో 2,733 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాల్ని పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలోని రవాణా శాఖ తమ అధికారిక వాహనాల్ని ఈ-వాహనాలతో భర్తీ చేసినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మిగిలిన అన్ని శాఖలు రవాణా శాఖ బాటలో పయనించాలని కోరారు. ఈ-వాహనాల వినియోగం కొత్త ఆరంభం మాత్రమే కాదని.. పర్యావరణ పరిరక్షణ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను తెలియజేస్తుందని పేర్కొన్నారు. నిజమే.. ప్రభుత్వాలు కొనుగోలు చేసే వాహనాలు మొత్తం విద్యుత్ వాహనాల్ని వినియోగించటం వల్ల ఆదర్శవంతంగానే కాదు.. పర్యావరణ పరిరక్షణకు తమవంతు సాయం చేసినట్లు అవుతుంది.
హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిరి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం ఈ కొత్త సంవత్సరంలో ఈ తరహా నిర్ణయం తీసుకుంటే బాగుండు. అంతేకాదు.. ప్రజా రవాణాకు సంబంధించి కొనుగోలు చేసే ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా ఈ-బస్సుల్ని కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటే.. మరింత బాగుంటుంది. హిమాచల్ ప్రదేశ్ సీఎంను తెలుగు రాష్ట్రాల్లోని ఏ సీఎం ముందుగా ఫాలో అవుతారో చూడాలి.