వాలంటీర్ వ్యవస్థ - కేసీఆర్ పై ఎంపీ సీఎం సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల్ వ్యవస్థపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 15 Aug 2023 10:41 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల్ వ్యవస్థపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని.. దేశంలోనే అవినీతికి తెలంగాణ ఫేమస్ గా మారిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ఇదే సమయంలో ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపైనా కీలక కామెంట్లు చేశారు.
అవును... భోపాల్ లో తన అధికారిక నివాసంలో మాట్లాడిన చౌహాన్.. తమ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైనా, బీఆరెస్స్ రాజకీయాలపైనా స్పందించారు. ఇందులో భాగంగా... మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీఆరెస్స్ పోటీ చేయాలనుకుంటే స్వాగతిస్తామని అన్నారు.
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లో అవినీతి గురించి మాట్లాడే ముందు తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి చూసుకోవాలని కేసీఆర్ కు సూచించారు. దేశంలోనే అవినీతికి తెలంగాణ కేరాఫ్ అయిందని ఆరోపించారు. అనంతరం ఏపీ లోని గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మధ్యప్రదేశ్ సీఎం స్పందించారు.
పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ పదవులు ఇస్తే వారు పార్టీ కోసమే పనిచేస్తారని.. దానివల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఎంపీ సీఎం చౌహాన్. పారదర్శక విధానంలో పెన్షన్ అందించడమే మంచిదని సూచించారు.
అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న పథకాలపైన ఆయన స్పందించారు. ఇందులో భాగంగా తాము అమలుచేస్తోన్న "ముఖ్యమంత్రి లాడ్లీ లక్ష్మి" పథకంలో మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈక్రమంలో 21 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు తాము నెలకు రూ. 1000 ఇస్తున్నామని చౌహాన్ వెల్లడించారు.
కాగా... మధ్యప్రదేశ్ అవినీతికి నిలయంగా మారిందని, రాష్ట్రంలో 50 శాతం కమీషన్ ప్రభుత్వం పనిచేస్తోందని నిన్న మొన్నటివరకూ తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై ప్రియాంక గాంధీ వ్యంగ్యంగా స్పందించారు.
"కర్ణాటకలోని అవినీతి బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ వసూలు చేసేది. మధ్యప్రదేశ్ లో బీజేపీ తన అవినీతి రికార్డును తానే బద్దలు కొట్టి ముందుకు సాగింది. రాష్ట్రంలో 50 శాతం కమీషన్ చెల్లించిన తర్వాతే చెల్లింపులు జరుగుతాయని మధ్యప్రదేశ్ లోని కాంట్రాక్టర్ల యూనియన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది" అని ప్రియాంక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే!