నీతి ఆయోగ్ మీట్..హాట్ హాట్ గా !
తాను తన మంత్రులు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని అర్ధించినా తమ రాష్ట్రానికి అన్యాయమే చేశారు అని రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.
By: Tupaki Desk | 27 July 2024 3:53 AM GMTఈసారి నీతి ఆయోగ్ మీటింగ్ మామూలుగా ఉండదని అంటున్నారు. అసలే బడ్జెట్ లో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అని మంట మీద ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ నేపధ్యంలో నీతి ఆయోగ్ మీటింగ్ అని పిలిచారు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని కొందరు సీఎంలు ఆలోచిస్తూనే మీటింగ్ కి వెళ్ళకుండా బహిష్కరించి తమ నిరసనను తెలియచేయాలని మరికొందరు సీఎంలు ఆలోచిస్తున్నారు.
బాయ్ కాట్ చేసే సీఎం ల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కేంద్రం మీద నిప్పులే చెరుగుతున్నారు. తాను తన మంత్రులు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని అర్ధించినా తమ రాష్ట్రానికి అన్యాయమే చేశారు అని రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. అందుకే నీతి ఆయోగ్ మీటింగ్ కి వెళ్ళడంలేదని అన్నారు. గతంలో కేంద్రం మీద కోపంతో కేసీఆర్ ఇలాగే చేశారు.
ఇక రేవంత్ రెడ్డి తో పాటుగా తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ సీఎం కూడా ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ కి వెళ్లడం లేదని అంటున్నారు. వీరంతా ఇండియా కూటమిలో మిత్ర పక్షాలే కావడం విశేషం. అయితే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం వేరే రూట్ ని ఎంచుకున్నారు. తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై అక్కడే ప్రధాని ముందే తన నిరసనను వ్యక్తం చేస్తాను అని ఆమె ప్రకటించడం విశేషం.
మమత నీతి ఆయోగ్ మీటింగ్ కి వెళ్ళడానికి రెండు కారణాలు ఉన్నాయి.ఒకటి బడ్జెట్ లో కేంద్రం వివక్ష చూపడం అయితే రెండవది ఉత్తర బెంగాల్ ని విడగొట్టి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది అని ఆమె తీవ్రంగా మండిపోతున్నారు. దాంతో నీతి ఆయోగ్ మీటింగ్ లో ఆమె శివమెత్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఆమెకు మాట్లాడే చాన్స్ ఇవ్వకపోతే అక్కడే చెప్పాల్సినవి అనాల్సినవి అనేసి వాకౌట్ చేస్తారు అని అంటున్నారు.
దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హాట్ హాట్ గా సమావెశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు చూస్తే నీతి ఆయోగ్ సమావేశాలకు ఇండియా కూటమి సీఎంలు అంతా హాజరై తమ రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపించడాన్ని అక్కడే నిలదీస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ విషయంలో మమతా బెనర్జీదే కరెక్ట్ అని అంటున్నారు. బహిష్కరిస్తే కేంద్రానికి నొప్పి తెలిసే అవకాశాలే ఉండవని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక నీతి ఆయోగ్ వంటి మీటింగులు సైతం వేడెక్కించడం బట్టి చూస్తే దేశంలో విపక్షాల బలం వారి గ్రాఫ్ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్ధం చేసుకోవలని అంటున్నారు.