కో అంటే కోటీ...పందెం నీదా నాదా !
పలుకుబడి ఉన్న వారు స్థాయి ఉన్న స్పెషల్ స్టేటస్ ఉన్న వారు పందేలు కోడి పందేలకు రావడం పందెం కట్టడం ఒక ట్రెడిషన్ గా ఉంది.
By: Tupaki Desk | 14 Jan 2025 3:38 AM GMTసంక్రాంతి వస్తే చాలు కోడి పందేలు షురూ అవుతాయి. గోదావరి జిల్లాలు ఈ పందేలకు పెట్టింది పేరు. చిన్న స్థాయి నుంచి తార స్థాయి వరకూ ఎక్కడ చూసినా పందేలే పందేలు. దాంతో ఆ సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని వినోదం అనాలో వ్యసనం అనాలో జూదం అనాలో లేక సంప్రదాయం అనాలో కూడా తెలియనంతగా ఈ పందేలు మారిపోయాయి.
పలుకుబడి ఉన్న వారు స్థాయి ఉన్న స్పెషల్ స్టేటస్ ఉన్న వారు పందేలు కోడి పందేలకు రావడం పందెం కట్టడం ఒక ట్రెడిషన్ గా ఉంది. అంతే కాదు ఏపీలో జరిగే ఈ కోడి పందేలకు తెలంగాణా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు అంటే ఎంతలా ఫ్యామస్ అయ్యాయో అర్థం చేసుకోవాల్సిందే.
చిన్నపాటి బరులలో రోజుకు ఇరవై దాకా పందేలు జరుగుతాయి. అదే భారీ స్థాయిలో అయితే డే అండ్ నైట్ పందేలు సాగుతాయి. ఇక కోడి పందేలలో ఆవేశకావేశాలు హెచ్చుగానే ఉంటాయి. ఆ వేడిలో ఆ మత్తులో ఏమీ తెలియదు. ఏకంగా కోట్లను పందేనికి కట్టేస్తారు. అలా చేతులు మారిన మొత్తాలతో కో అంటే కోడి కాదు కోటి అన్నట్లుగా గోదావరి సహా అనేక జిల్లాలు రీ సౌండ్ చేస్తున్నాయి.
ఇక చూస్తే కనుక భోగీ నుంచి మొదలైన ఈ కోడి పందేలలో తొలి రోజు ఆట ముగిసేసరికి అక్షరాలా 630 బరులను గీసి మరీ కోడి పందేలు యథేచ్చగా నిర్వహించారని తద్వారా సుమారు 160 కోట్ల రూపాయలు చేతులు మారాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
కోడి పందేల విశేషం ఏంటో తెలియదు కానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక్కటి అయిపోయారు. తాము చేయాల్సిన సమరాన్ని కోళ్లకు అప్పగించి వారు వీరూ అంతా ఒకే చోట ఆశీనులు అయిపోయారు. కోడి పందేలు ఒక సంప్రదాయం అని వైసీపీ నేతలు కూడా స్వేచ్చగా పాల్గొనవచ్చు అని ఎవరినీ అడ్డేది లేదని ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్ చెప్పారు అంటేనే రాజకీయ సామరస్యం ఎంతలా వెల్లి విరుస్తోందో అర్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ కోడి పందేలా విశేషం ఏంటి అంటే పందేలు గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. అవి మోటారు బైకుల నుంచి భారీ వాహనాల దాకా ఉంటున్నాయి. లక్షకు తగ్గకుండా పందేలు కాసేవారికే ఈ బహుమానాలు. అది కూడా డజన్ కి తగ్గకుండా పందేలు కాసి అందులో గెలిచిన వారికే ఈ నజరానాలు అని నిర్వహాకులు ప్రకటించడంతో ఆ వేడితో పందెం రాయుళ్ళు మరింతగా రెచ్చి మరీ బరులలోకి తమ కోళ్లను దూకించేస్తున్నారు. ఇక రానున్న మూడు రోజుల పందేలు కూడా వీర లెవెల్ లో సాగుతాయని అంటున్నారు. దాంతో ఏకంగా వందల కోట్లు చేతులు మారడం ఖాయమని అంటున్నారు. ఈసారి కోడి పందేలు భారీ స్థాయిలోనే జరుగుతున్నాయని చెబుతున్నారు.