కోళ్లు-కోట్లు- ఈ విషయాలు తెలుసా?
ఇక, కోడి పందేలంటే.. ఏదో వచ్చాం వెళ్లాం కాదు..! ఇది పక్కా వ్యాపారం. ఆశ్చర్యం అనిపించినా.. గోదావరి జిల్లాల్లో జరుగుతున్న పందేలను గమనిస్తే.
By: Tupaki Desk | 14 Jan 2025 9:00 AM GMTతెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఊరూ వాడా.. పిల్లాపాపా అందరూ కలివిడిగా కోలాహలంగా జరుపుకొనే సంక్రాంతికి కోడి పందేలు మరో లెవిల్‌ను తీసుకువస్తాయి. ప్రతి ఏటా సంక్రాంతి అంటే.. కోడి పందేలు కామన్. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎన్ని ఆంక్షలు విధించినా కోళ్లు ఎగరాల్సిందే.. కత్తులు దూయాల్సిందే! అన్న చందంగా ఏపీలోని కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం బరులు పగ్గాలు తీసేసి మరీ పరుగులు పెడతాయి. ఈ ఏడాది అయితే.. మరిన్ని బరులు వెలిశాయి.
ఒకప్పుడు కొంతలో కొంతైనా పోలీసుల భయం ఉండేది. కానీ, ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడిన తొలి ఏడాది కావడంతో పాటు.. ప్రభుత్వ పాలన పరంగా అధికార పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఖుషీలో ఉన్నారు. దీంతో అధికారులు సైతం చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో బరులు బారులు తీరినట్టుగా ఒకప్పుడు పల్లెలకు మాత్రమే పరిమితమైన ఈ పందేలు.. ఇప్పుడు నగరాలు.. పట్టణాలకు కూడా విస్తరించారు.
ఇక, కోడి పందేలంటే.. ఏదో వచ్చాం వెళ్లాం కాదు..! ఇది పక్కా వ్యాపారం. ఆశ్చర్యం అనిపించినా.. గోదావరి జిల్లాల్లో జరుగుతున్న పందేలను గమనిస్తే.. ఎంత పక్కావ్యాపారమో తెలుస్తుంది. ప్రతి రూపాయీ లెక్కే. కోట్ల రూపాయలు పందేలు ఒడ్డే వారికి పక్కా భద్రత కూడా కల్పిస్తున్నారు. వందల కొద్దీ బౌన్సర్లు.. కూడా బరుల్లో కాపలా ఉంటున్నారు. వీరికి ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి.. బరుల నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. ఇక, పందేలు కట్టేందుకు వచ్చేవారి స్థాయిని బట్టి.. ఏర్పాట్లు ఉంటున్నాయి.
ఉదాహరణకు 5 లక్షల రూపాయల పైబడి పందేలు కట్టేవారికి ఇచ్చే మర్యాద, భద్రత(బౌన్సర్లతో) డిఫరెంట్‌గా ఉంటోంది. వీరికి అప్పటికప్పుడు వండిన పందెం కోడి బిర్యానీని పెడుతున్నారు. ఇక, గోదావరి రుచులు.. మరీ డిఫరెంట్‌గా సాగుతున్నాయి. అదే విధంగా ప్రత్యేక మందు ఏర్పాట్లు.. విందు భోజనాలకు కొదవేలేదు. కోళ్లతోపాటు కోట్లు తీసుకువచ్చేవారికి.. అదిరిపోయేలా ఉన్న ఏర్పాట్లు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఉండవంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక, అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేందుకు ప్రత్యక కౌంటర్లు... మనీ లెండర్లు సిద్ధంగా ఉంటారు. సో.. సంక్రాంతి అంటే భిన్నమైన వాతావరణమే కాదు.. భిన్నమైన పందేలు కూడా కనిపిస్తుండడం గమనార్హం.