తప్పు మీద తప్పు... విమానంలో వడ్డించిన ఆమ్లెట్ లో బొద్దింక!
గత కొంతకాలంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో తప్పు మీద తప్పు జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Sep 2024 6:01 AM GMTగత కొంతకాలంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో తప్పు మీద తప్పు జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇటీవల ఓ భారతీయ అమెరిక, క్యాపిటెల్ ఇన్వెస్ట్ మెంట్ సీఈఓ అనిప్ పటేల్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న తన అనుభవాన్ని "చెత్త" అని పేర్కొంటూ అతడు వీడియో పోస్ట్ చేశాడు.
చికాగో నుంచి న్యూఢిల్లీకి జరిగిన తన 15 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీ ఏమాత్రం ఆహ్లాదకరంగా లేదు సరికదా.. భరించాల్సి వచ్చిందని తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సమయంలో తాజాగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో పెట్టిన ఫుడ్ లో బొద్దింక కనిపించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... ఎయిర్ ఇండియా విమానలో ప్రయాణికులకు సరఫరా చేసిన ఆహారంలో బొద్దింక కనిపించిందని ఓ ప్రయాణికురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వ్యవహారన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమకు విమానంలో ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించిందని తెలిపారు. ఫోటోలు పోస్ట్ చేశారు.
సెప్టెంబర్ 17న ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానం ఆన్ బోర్డ్ భోజనంలో తాము బొద్దింకను కనుగొనే సమయానికి తమతో పాటు తమ రెండేళ్ల బిడ్డ సగానికిపైగా ఆమ్లెట్ తినేశాడని.. అనంతరం ఫుడ్ పాయిజన్ తో ఇబ్బండి పడ్డాడని ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు.
ఈ పోస్ట్ కు ఎయిర్ ఇండియా, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ లతోపాటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులకు తన ఫిర్యాదును ట్యాగ్ చేశారు. దీంతో... ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది.
ఇందులో భాగంగా... మీరు పడిన ఇబ్బంది గురించి ఆందోళన చెందుతున్నాం.. తదుపరి దర్యాప్తు కోసం క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదించాం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తిసుకుంటాం అని తెలిపింది. ఈ పోస్ట్ ల కింద కమెంట్ సెక్షన్ లో ఒక్కొక్కరూ తమ తమ చేదు అనుభవాలను పంచుకుంటూ స్పందిస్తుండటం గమనార్హం!