దేశంలో తొలి కాయిన్ ఏటీఎం.. క్యూఆర్ కోడ్ తో తీసుకోవచ్చు
దీని ప్రత్యేకత ఏమంటే.. డిజిటల్ పేమెంట్ ద్వారా కావాల్సిన చిల్లరను ఈ వెండింగ్ మెషీన్ నుంచి పొందే వీలుంది.
By: Tupaki Desk | 27 Oct 2024 7:33 AM GMTచిల్లర చీకాకుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఎక్కడికి వెళ్లినా.. తగిన చిల్లర లేని కారణంగా వస్తుసేవల్ని అందించేందుకు సైతం వెనుకాడే పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలోనే మొదటి చిల్లర నాణెల వెండింగ్ మెషీన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని కేరళలోని కోజీకోడ్ లోని పుతియారాలో ఉన్న ఫెడరల్ బ్యాంకులో ఏర్పాటు చేశారు.
దీని ప్రత్యేకత ఏమంటే.. డిజిటల్ పేమెంట్ ద్వారా కావాల్సిన చిల్లరను ఈ వెండింగ్ మెషీన్ నుంచి పొందే వీలుంది. క్యూఆర్ కోడ్ ఆధారంగా దీని నుంచి చిల్లర తీసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో నుంచి రూపాయి.. 2 రూపాయిలు.. 5 రూపాయిలు.. 10 రూపాయిల చిల్లర నాణేల్ని తీసుకునే వెసులుబాటు ఉంది. స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి.. అవసరమైన నాణెల మీద క్లిక్ చేస్తే చాలు.. మెషీన్ నుంచి చిల్లర నాణేలు వచ్చేస్తాయి.
గతంలో ఇలాంటి మెషీన్లు ఉన్నప్పటికీ అవి నోట్లను మాత్రమేస్వీకరించి నాణెల్నిఇచ్చేది. ఇప్పుడు పెరిగిన డిజిటల్ పేమెంట్ల ఆధారంగా క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా అవసరమైన చిల్లర అందేలా ఏర్పాట్లు చేశారు. ఏ బ్యాంక్ ఖాతా ఉన్నప్పటికీ ఈ మెషీన్ ద్వారా.. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తీసుకునేలా సాంకేతికతను సిద్ధం చేశారు. దీంతో.. చిల్లర సమస్యలు తీరిపోతాయని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో చిల్లర ఏటీఎంలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.