కేటీఆర్ - హరీశ్ మధ్య కోల్డ్ వార్.. గులాబీ పార్టీలో ఇదే హాట్ టాపిక్?
ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామంలో తెలంగాణ శ్రీమండైన ప్రముఖుడి సంస్థకు చెందిన అంశంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మరింత ఎక్కువైనట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 13 Aug 2024 4:39 AM GMTతమ మీదా.. తమ పార్టీ మీదా అదే పనిగా సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని.. అబద్ధాల్ని.. అసత్యాల్ని అదే పనిగా వండి వారుస్తున్నట్లుగా వారు పేర్కొంటున్నారు. ఈ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వారికి ఎప్పటికప్పుడు వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు. అయితే.. కేటీఆర్ మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. తమకు చెందిన మీడియా సంస్థలోనూ ఈ తరహా కథనాలు ఎన్నో రాశారు. అంతేకాదు.. గులాబీ పార్టీ డీల్ చేసే సోషల్ మీడియా ఖాతాలు.. యూట్యూబ్ చానళ్లలో వారు వండి వార్చిన కథనాలకు ఆధారాలు.. సాక్ష్యాలు చూపించారా? అని ప్రశ్నిస్తున్నారు. తమ వరకు ఒకలా.. మిగిలిన వారి విషయంలో మరోలా వ్యవహరించే కేటీఆర్ తీరును తప్పు పడుతున్నారు.
ఇంతకూ గులాబీ పార్టీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామం.. ఆ పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది. గులాబీ పార్టీలో ఐదు పవర్ సెంటర్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యం. అందులో కేసీఆర్.. కేటీఆర్.. కవిత.. హరీశ్ రావులతో పాటు సంతోష్ లు కేంద్రంగా ఉండటం తెలిసిందే. మిగిలిన పవర్ సెంటర్ల సంగతి ఎలా ఉన్నా.. కేటీఆర్ - హరీశ్ మధ్యన అధిపత్య పోరు నడుస్తూనే ఉందన్న వాదన తరచూ వినిపిస్తోంది. తాజాగా ఇది మరింత ఎక్కువైందంటున్నారు.
ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామంలో తెలంగాణ శ్రీమండైన ప్రముఖుడి సంస్థకు చెందిన అంశంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మరింత ఎక్కువైనట్లుగా తెలుస్తోంది. సదరు సంస్థకు సంబంధించిన ఒక వివాదంలో రాజకీయంగా ముందుకు వెళ్లకూడదన్న స్టాండ్ హరీశ్ తీసుకుంటే.. కేటీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూపై రాజకీయంగా ముందుకు వెళ్లకూడదన్నది హరీశ్ ఆలోచన అయితే.. అలాంటిదేమీ వద్దన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందంటున్నారు.
దీంతో.. ఈ ఇద్దరు భిన్నరీతిలో రియాక్టు కావటంతో గులాబీ నేతలు పలువురు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ లో గులాబీ పార్టీ మీడియా కూడా కేటీఆర్ పక్షాన నిలిచినట్లుగా తెలుస్తోంది. దీనిపై హరీశ్ అసంత్రప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు కొన్ని పరిమితుల్ని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నది హరీశ్ మాట అయితే.. అలాంటివేమీ ఉండవన్నట్లుగా కేటీఆర్ ఆలోచనగా ఉందంటున్నారు.మొత్తంగా ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళుతుందన్నది పింకీల మధ్య చర్చగా మారింది.