Begin typing your search above and press return to search.

అయ్యో కలెక్టర్ సాబ్ అడ్డంగా బుక్ అయ్యారు

ఆ విషయాన్ని తర్వాత గుర్తించిన కలెక్టర్.. తన షూ విడిచి పెట్టి తన అటెండర్ కు ఇచ్చారు. దీంతో.. ఆ అటెండర్ కలెక్టర్ బూట్లను పట్టుకొని కార్యక్రమం ముగిసే వరకు నిలుచున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 4:58 AM GMT
అయ్యో కలెక్టర్ సాబ్ అడ్డంగా బుక్ అయ్యారు
X

కొన్ని ఉదంతాల్ని చూస్తే.. కాలమహిమ అన్న మాట అప్రయత్నంగా నోటి నుంచి వచ్చేస్తుంది. తాజాగా ఒక జిల్లా కలెక్టర్ కు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే.. కంటికి కనిపించే ఫోటోల వెనుక అసలేం జరిగిందో తెలీదు కానీ.. ఇప్పుడైతే ఆయన వివాదంలో చిక్కుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన చేసిన పనికి ఆయన్ను హీరోగా కీర్తించటమేకాదు.. ఇలాంటి కలెక్టర్లు ఉండాలన్న మాట వినిపించింది. ఇప్పుడు అలాంటి ఆయన పెను వివాదంలో ఇరుక్కుపోయారు. ఆయన ఎవరంటే.. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న భవేశ్ మిశ్రా.

క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రార్థనలకు హాజరయ్యారు. స్థానిక చర్చికి వెళ్లిన ఆయన బూట్లతోనే వెళ్లారు. ఆ విషయాన్ని తర్వాత గుర్తించిన కలెక్టర్.. తన షూ విడిచి పెట్టి తన అటెండర్ కు ఇచ్చారు. దీంతో.. ఆ అటెండర్ కలెక్టర్ బూట్లను పట్టుకొని కార్యక్రమం ముగిసే వరకు నిలుచున్నారు. ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కట్ చేస్తే.. ఇదే భవేశ్ మిశ్రాకు చాలా మంచి పేరుంది. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ లో 58వ ర్యాంక్ ను సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యారు. 2002 అక్టోబరులో ఆయన భార్య కం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టరర్ గా వ్యవహరిస్తున్న ఇలా త్రిపాఠి డెలివరీ కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే కాన్పు చేయించుకున్నారు. కలెక్టర్ గా ఉండి.. అడిషనల్ కలెక్టర్ అయిన తన భార్యకు డెలివరీని సర్కారు దవాఖానాలో చేయిచంటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వైనంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. అప్పట్లో మంత్రి చేతులు మీదుగా కేసీఆర్ కిట్ అందుకున్న ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

సింఫుల్ గా ఉండటం.. ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉండే సదరు అధికారి తాజాగా మాత్రం ప్రార్థనలకు వెళ్లిన సందర్భంగా బూట్లతో చర్చిలోకి వెళ్లి.. వాటిని విడిచే క్రమంలో అటెండర్ చేతికి షూలు ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఇదంతా చూసినప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎంత ఆదర్శవంతంగా ఉన్నప్పటికి చిన్న తప్పులకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు ఆయన అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు చెప్పాలి.