ఉదయాన్నే 5 గంటలకు విద్యార్థి తలుపు కొట్టిన జిల్లా కలెక్టర్
‘విద్యార్థుల ఇంటి తలుపు తట్టే’ కార్యక్రమాన్ని షురూ చేసిన ఆయన.. జిల్లాలో పదో తరగతి ఫలితాలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 7 Feb 2025 5:38 AM GMTఅందరూ ఒకేలా వ్యవహరించరు. పని అందరూ చేస్తారు. కొందరు మాత్రం మనసు పెట్టి చేస్తారు. తమకున్న పరిమిత అధికారంలో ఏదో ఒకటి చేయాలని తపించే ఉన్నతాధికారులకు నిలువెత్తు రూపంగా నిలుస్తారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నిలుస్తారు. జిల్లా పాలనాధికారిగా వ్యవహరిస్తున్న ఆయన.. పదో తరగతి విద్యార్థులకు స్ఫూర్తి రగిలించేలా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. విద్యలో వెనుకబడిన వారిని ఉత్సాహపరిచి.. వారికి మంచి మార్కులు వచ్చేలా చేయటం కోసం ఆయన సరికొత్త కార్యక్రమాన్నిచేపట్టారు.
‘విద్యార్థుల ఇంటి తలుపు తట్టే’ కార్యక్రమాన్ని షురూ చేసిన ఆయన.. జిల్లాలో పదో తరగతి ఫలితాలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం తెల్లవారుజామున ఐదు గంటల వేళలో.. జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్లి.. సదరు పదో తరగతి విద్యార్థి ఇంటి తలుపు తట్టటం.. చదువుకోవాలని ఉద్బోదించటంతో పాటు.. చదువు విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే సూచనలు చెప్పే తీరును చూస్తే వావ్ అనాల్సిందే.
తాజాగా తెల్లవారుజామున ఐదు గంటల వేళలో జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం పరిధిలోని దేశ్యతండాను సందర్శించారు. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్తి దేవరకొండ భరత్ చంద్రాచారి ఇంటికి వెళ్లిన ఆయన.. తలుపు తట్టి.. ‘‘నేను కలెక్టర్ హనుమంతరావును’’ అని పరిచయం చేసుకోవటమే కాదు.. పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధించాలన్న దానికి కొన్ని సూచనలు చేశారు. తాను చేపట్టిన విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని షురూ చేశారు.
విద్యార్థి భరత్చంద్రను.. చదువు అయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? అని అడగ్గా.. పోలీసు అధికారిని కావాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను అండగా ఉంటానని చెప్పిన కలెక్టర్.. సదరు విద్యార్థి శారీరకంగా బలహీనంగా ఉండటాన్ని గుర్తించి.. అతడి పోషణ కోసం నెలకు రూ.5 వేలు చొప్పున తన సొంత డబ్బుల్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తన జేబులోని రూ.5 వేలు అందజేసి.. చదువుకోవటానికి వీలుగా కుర్చీ.. రైటింగ్ ప్యాడ్.. పుస్తకాలు.. పెన్నులు అందించారు. ఇలాంటి మంచి మనసులు పడే కష్టం సమాజ రూపురేఖల్ని మారుస్తుందని చెప్పక తప్పదు. ఈ తరహాలో మిగిలిన కలెక్టర్లు పని చేస్తే మార్పు ఆటోమేటిక్ గా రాకుండా ఉంటుందా?