వందల కోట్ల విలువైన భూముల్ని కాపాడిన కలెక్టర్ కు ఇదేం గిఫ్టు?
By: Tupaki Desk | 2 Aug 2023 4:54 AM GMTనీతిగా.. నిజాయితీగా పని చేసే వారి విషయంలో ప్రభుత్వం ఇబ్బందులకు గురైనా.. అధికారంలో ఉన్న వారికి ఆర్థిక నష్టం వాటిల్లినా చూసి చూడనట్లుగా వ్యవహరించే రోజులు పోయి చాలాకాలమే అయ్యింది. నోరు తెరిస్తే నీతులు చెబుతూ.. తమకు మించిన కమిట్ మెంట్ మరెవరికీ లేదన్నట్లుగా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లు వ్యవహరిస్తారు. మరి.. వారి పాలనలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే.
వందలకోట్ల రూపాయిల విలువైన కాందిశీకుల భూమిని కాజేసే వారికి చెక్ పెడుతూ.. ఒక మహిళా కలెక్టర్ ధైర్యసాహసాల్ని ప్రదర్శించారు. ఇలాంటి వారి విషయంలో మరింత ప్రోత్సహించేలా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా బదిలీ షాకివ్వటం హాట్ టాపిక్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని సర్కారు ఉన్నపళంగా మార్చేసిన వైనం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
ఈ బదిలీ వెనుక రూ.600 కోట్ల విలువైన చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ పరిధిలోని 401 ఎకరాల కాందిశీకుల భూముల్ని కొట్టేసే పన్నాగానికి చక్రం తప్పిన ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడికి సర్కారు తలొగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల విలువైన ఈ భూమి విషయంలో తాను చెప్పినట్లుగా చేయటానికి జిల్లా కలెక్టర్ ససేమిరా అనటం.. కాందిశీకుల భూమిని పరిరక్షించే విషయంలో ఆమె ప్రదర్శించిన కమిట్ మెంట్ కు అసహనానికి గురైన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే పట్టుబట్టి మరీ జిల్లా కలెక్టర్ కు బదిలీని బహుమతిగా అందించినట్లుగా ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తమకు అనుకూలంగా నడుచుకునే కలెక్టర్ ను తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్డీవో బదిలీ కూడా సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీతులు చెప్పే ముఖ్యమంత్రి.. ఆయన కుమారుడైన మంత్రికి నిజాయితీతో పని చేసే కలెక్టర్ ను కాపాడుకోవాల్సిన ఉద్దేశం లేకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరి.. దీనికి తండ్రికొడుకులు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారో చూడాలి.