కూటమి సర్కారుపై శాటిస్‌ఫాక్షన్: కలెక్టర్లు చంద్రబాబు కీలక టాస్క్
తద్వారా .. సర్కారుకు-సామాన్యులకు మధ్య అంతరం తగ్గి.. మేలైన పాలన అందించేందుకు చాన్స్ వస్తుంది.
By: Tupaki Desk | 6 Oct 2024 4:32 PM GMTఏపీ సీఎం చంద్రబాబు.. అంటేనే సర్వేలకు కేరాఫ్. ఆయన ఏం చేసినా తూకం వేసుకుంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికారులు ఎలా పనిచేస్తున్నారు? అనే విషయాలను నిశితంగా గమనించు కుంటారు. దాని ప్రకారం.. భవిష్యత్తులో మార్పులు చేర్పులు చేసుకుంటారు కూడా! ఇప్పుడు ఇదే జరుగు తోంది. నిజానికి ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు అనుసరించడం మెచ్చుకోదగ్గ విషయమే. తద్వారా .. సర్కారుకు-సామాన్యులకు మధ్య అంతరం తగ్గి.. మేలైన పాలన అందించేందుకు చాన్స్ వస్తుంది.
గతంలోనూ 2014-19 మధ్య చంద్రబాబు తాను చేపట్టిన పథకాలు.. పాలనపై ప్రజల నుంచి సంతృప్తి స్థాయిలు తీసుకునేవారు. పదే పదే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. పేర్కొనేవారు. ఇలానే ఇప్పుడు ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన 100 రోజుల్లో ప్రజలు తమ పాలనపై ఏలా ఉన్నారు? ఏం ఆలోచన చేస్తున్నారనే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ప్రజల అభిప్రాయాలు.. వారి సంతృప్తి స్థాయిలను అంచనా వేసేందుకు నేరుగా జిల్లాల కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
గతంలో వైసీపీ ఉన్నప్పుడు వలంటీర్లు, సచివాలయాల ద్వారా గ్రాఫ్ తెప్పించుకునేవారు. తమ పాలనపై ప్రజలు ఎలా ఉన్నారని.. ఎలా స్పందిస్తున్నారని జగన్ కూడా లెక్కలు వేసుకున్నారు. అయితే.. వలంటీర్లు, సచివాలయాలు.. రాజకీయ ప్రేరేపితం కావడంలో అన్నీ అనుకూలంగానే ఇచ్చారనే వాదన వినిపించింది. ఫలితంగా వ్యతిరేకతను గుర్తించే లోపే.. సర్కారు ఎన్నికలకు వెళ్లడం.. మార్పు దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయింది.
కానీ, ఇప్పుడు చంద్రబాబు నేరుగా ఈ బాధ్యతలను రాజ్యాంగ బద్ధ ఉద్యోగులైన కలెక్టర్లకే అప్పగించారు. వీరు ఇచ్చే నివేదికలకు శాంటిటీ(పవిత్రత) ఉంటుందని బాబు అంచనా. ఇది నిజమే. ఏ చిన్న తేడా వచ్చినా.. తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భావించే కలెక్టర్లు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. దీంతో చంద్రబాబు తమ కూటమి సర్కారు పనితీరు ఎలా ఉందో ప్రజల నుంచి పసిగట్టి నివేదికలు అప్పగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు.
ఇవీ.. పరిశీలనాంశాలు..
+ వంద రోజుల్లో ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల సంతృప్తి
+ అన్న క్యాంటీన్ల పనితీరు.. ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి, మార్పులు ఏమైనా కోరుతున్నారా?
+ ఎమ్మెల్యేల పనితీరు.
+ ఉచిత ఇసుక, పింఛన్ల పంపిణీ ఇలా.. వంద రోజుల్లో చేసిన పనులపై ప్రజల నుంచి చంద్రబాబు సంతృప్తి స్థాయిలను కోరుకుంటున్నారు.