జగన్ కి భారీ షాక్ ఇచ్చిన అలీ!
ఆయన 2019 ఎన్నికల నుందు వైసీపీలో చేరారు. అప్పటికే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల అలీకి జగన్ సీటు ఇవ్వలేకపోయారు
By: Tupaki Desk | 28 Jun 2024 2:41 PM GMTటాలీవుడ్ కమెడియన్ అలీ జగన్ కి బిగ్ షాక్ ఇచ్చారు. రిజల్ట్స్ వచ్చి అతి పెద్ద డిజాస్టర్ లాంటి ఫలితాన్ని అందుకున్న వైసీపీకి జూన్ నెల ముగియకుండానే అలీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లుగా అలీ ప్రకటించేశారు. దాంతో ఆయన ఫ్యాన్ పార్టీకి ఇక మీదట ఫ్యాన్ కానట్లే అని అంటున్నారు.
ఆయన 2019 ఎన్నికల నుందు వైసీపీలో చేరారు. అప్పటికే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల అలీకి జగన్ సీటు ఇవ్వలేకపోయారు. ప్రభుత్వం వస్తే మంచి గౌరవం ఉంటుందని అలీకి హామీ ఇచ్చారు. ఆ లెక్కన ఎమెల్సీ కానీ రాజ్యసభ కానీ అలీకి దక్కుతుందని భావించారు.
కానీ ప్రతీ సారీ ఊరించిన ఆ పదవులు అలీకి చేరలేదు. అయితే అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని మాత్రం ఇచ్చారు. అయితే అలీ జగన్ ని పొగుడుతూ వచ్చారు. గతసారి బాగా ప్రచారం చేశారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. రాజమండ్రి అర్బన్ కానీ లేదా గుంటూర్లో అసెంబ్లీ సీటు కానీ గుంటూరు లేదా కర్నూల్ లలో ఎంపీ సీటు కానీ ఆయన ఆశించారు అని అంటారు.
కానీ మొత్తం జాబితాలు రిలీజ్ అయినా ఎక్కడా అలీ పేరు మాత్రం లేదు. దాంతో అలీ ఎన్నికలకు ముందే ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఆయన ప్రచారంలో పాల్గొన లేదు. వైసీపీ స్టార్ కాంపెయినియర్లలో ఆయన పేరు కూడా ఎక్కడా లేదు. దాంతో ఆనాడే అలీ దూరం అవుతారని అనుకున్నారు.
అయితే రిజల్ట్స్ వచ్చి దాదాపు నెలకు దగ్గర పడుతున్న వేళ అలీ తన డెసిషన్ ప్రకటించారు. ఆయన వల్ల పార్టీకి ఏమి దక్కింది అన్నది ఒక చర్చ అయితే ఆయనకు పార్టీ ద్వారా ఏమి దక్కింది అన్నది మరో చర్చ. అయితే ఆయన ప్రచారానికి వైసీపీకి ఇచ్చిన ఎలక్ట్రానికి మీడియా అడ్వైజర్ పదవికీ సరిపోయింది అని అంటున్న వారూ ఉన్నారు
టాలీవుడ్ మొత్తం వైసీపీని వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో ప్రముఖ కమెడియన్ గా ఉన్న అలీ వచ్చి చేరడం ఒక విధంగా బూస్టప్ గానే ఉంది. కానీ సినీ రంగంలో వైసీపీకి మద్దతుని ఆయన కూడగట్ట లేకపోయారు అన్న చర్చ కూడా ఉంది. ఆయన మీడియా ముందు వచ్చి స్ట్రాంగ్ గా వైసీపీని సమర్ధించిన సందర్భాలు కూడా తక్కువ అన్న వారూ ఉన్నారు. అలీకి చట్ట సభలలో ప్రవేశించాలని కోరిక.
దాని కోసం పాతికేళ్ళ క్రితమే ఆయన టీడీపీలో చేరారు. కానీ ఆయన ఆశలు అక్కడ తీరలేదు. వైసీపీలో 2019లో వచ్చారు. అక్కడా తీరలేదు. మరి అలీ తిరిగి టీడీపీలో చేరుతారా తన సినీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ జనసేనలో చేరుతారా అనేది చూడాలి. మొత్తానికి అలీ ఆశలు 2029 ఎన్నికల్లో అయినా తీరుతాయా అన్నది కూడా చూడాలి.
అలీ సంగతి అలా ఉంటే వైసీపీకి సినీ మద్దతు అన్నది పూర్తిగా కరవు అని అలీ రాజీనామా రుజువు చేసింది. ఇక మిగిలింది పోసాని క్రిష్ణ మురళి. ఎన్నికల ఫలితాల తరువాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. సినీ రంగం ప్రజలను ప్రభావితం చేసే పవర్ ఫుల్ ఫీల్డ్. అక్కడ నుంచి వైసీపీకి మద్దతు తక్కువగానే మొదటి నుంచి ఉంది. అయితే అలా వచ్చిన వారిని సైతం వైసీపీ ఉంచుకోలేకపోయిందా లేక వారు ఇమడలేకపోయారా అన్నది కూడా చర్చగానే ఉంది
సూపర్ స్టార్ క్రిష్ణ సోదరుడు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావుతో మొదలెడితే జీవితా రాజశేఖర్, జయసుధ, మంచు మోహన్ బాబు, భానుచందర్, ఎస్వీ క్రిష్ణారెడ్డి అచ్చిరెడ్డి, హీరో రాజా ఇలా చాలా మంది వైసీపీలోకి వచ్చారు. వెళ్లారు. అదే టీడీపీకి అయితే మొదటి నుంచి అభిమానులుగా ఉన్న వారు అలాగే కంటిన్యూ అవుతున్నారు.
లోపం ఎక్కడ ఉంది అన్నది చూసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి భారీ ఓటమి వెనక సినీ ప్రభావం కూడా ఉందన్నది వాస్తవం. అలీ రాజీనామా ఆ కోణం నుంచి చూస్తే వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలని అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో అయినా సినీ కాంతులు వైసీపీ మీద ప్రసరిస్తాయా లేదా అన్నది.