గూగుల్ పై సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు
అమెరికా ప్రభుత్వం, గూగుల్ మధ్య జరుగుతున్న యాంటి ట్రస్ట్ విచారణలో భాగంగా సత్య నాదెళ్ల తన వాదన వినిపించారు.
By: Tupaki Desk | 3 Oct 2023 11:46 AM GMTసెర్చింజన్ దిగ్గజం.. గూగుల్ పై మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. సెర్చింజన్ మార్కెట్ లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. సెర్చింజన్ మార్కెట్ లో గూగుల్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ల సంస్థల మధ్య వివాదానికి సంబంధించి అమెరికా కోర్టులో జరుగుతున్న విచారణకు సత్య నాదెళ్ల స్వయంగా హాజరయ్యారు.
అమెరికా ప్రభుత్వం, గూగుల్ మధ్య జరుగుతున్న యాంటి ట్రస్ట్ విచారణలో భాగంగా సత్య నాదెళ్ల తన వాదన వినిపించారు. సెర్చింజన్ మార్కెట్ లో తన
గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం యాపిల్ వంటి సంస్థలకు గూగుల్ సంస్థ బిలియన్ల డాలర్లు చెల్లించినట్లు అమెరికా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు ఈ కేసులో తమ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో భాగంగా సత్య నాదెళ్ల సైతం తమ సంస్థ వాదనలను కోర్టు ముందు ఉంచారు.
గూగుల్ పోటీగా మైక్రోసాఫ్ట్.. బింగ్ అనే సెర్చింజన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెర్చింజన్ మార్కెట్ లో 2009 నుంచి బింగ్ తన మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, యాపిల్ తో గూగుల్ చేసుకున్న ఒప్పందాలతో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, తదితరాల్లో ఇన్ బిల్ట్ గా గూగుల్ ఉంటుందని.. దీంతో తమ సెర్చింజన్ బింగ్ దానితో పోటీ పడలేకపోతోందని సత్య నాదెళ్ల ఆరోపిస్తున్నారు. తమకు వినియోగదారుల ఆదరణ దక్కుతోందని గూగుల్ చెప్పుకుంటోందని.. అయితే దీన్ని తాము ఆధిపత్య ధోరణిగానే చూస్తామని సత్య నాదెళ్ల తెలిపారు.
మరోవైపు ప్రపంచంలోని తొలి ప్రముఖ సెర్చ్ ఇంజన్ గా గూగుల్ భారీ ఎత్తున డేటా సేకరించిందని అమెరికా ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. అలాగే తొలి సెర్చింజన్ కంపెనీగా తన నెట్‌వర్క్ ను భారీగా గూగుల్ విస్తరించుకుందని తెలిపింది. ఇందుకు పలు అనైతిక పద్ధతులకు గూగుల్ పాల్పడిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. తప్పుడు పద్ధతుల్లో ఎదగడంతో వాణిజ్య ప్రకటనలు, వినియోగదారులను అందించే శక్తిమంతమైన సాధనంగా గూగుల్ మారిందని వాదించింది. అమెరికా ప్రభుత్వ ఆరోపణలకు సత్య నాదెళ్ల సైతం మద్దతు పలికారు.
ఈ క్రమంలో సత్య నాదెళ్ల తన వాదనలు వినిపించారు. ఒక సెర్చింజన్ విజయం దాని పంపిణీ పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ తమ బింగ్ సెర్చింజన్ ను ఇన్ బిల్ట్ గా ఐఫోన్లలో ఉంచడానికి గానూ భారీ ఎత్తున చెల్లించడానికి తాము సిద్ధమయ్యాయని సత్య నాదెళ్ల తెలిపారు. సెర్చింజన్‌ను ‘డిఫాల్ట్’ (ఇన్‌బిల్ట్)గా ఇవ్వడంపైనే సెర్చింజన్ విజయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ఈ క్రమంలో యూజర్లు సులువుగా తమకు నచ్చిన సెర్చింజన్ కు బదిలీ అవుతారని గూగుల్ చేస్తున్న వాదనలో నిజం లేదని సత్య నాదెళ్ల వెల్లడించారు. ‘సఫారీ’ బ్రౌజర్ లో బింగ్ డిఫాల్ట్ గా ఉంటే బింగ్ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. కానీ, గూగుల్ తో జట్టుకట్టిన యాపిల్ ఏటా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే బింగ్ సెర్చింజన్ వెనుకబడిపోయిందన్నారు.
సెర్చింజన్ మార్కెట్ లో గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు పద్ధతులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడమో లేక మార్పు తీసుకొస్తుందనో తాము ఆశిస్తున్నామని సత్య నాదెళ్ల తెలిపారు. ఈ నేపథ్యంలోనే బింగ్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు.
కాగా వినియోగదారుల ఆదరణను పొందడానికి బింగ్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను జోడిస్తూ మైక్రోసాఫ్ట్ కొన్ని మార్పులు చేసింది. అది గూగుల్ గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తుందని ఆశించింది. ఏఐ సాంకేతికతతో వినియోగదారులు తమ వైపు మళ్లుతారని భావించింది. అయితే గూగుల్ కూడా ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టడం వేగవంతం చేసింది. దీంతో రానున్న రోజుల్లో ఏఐలోనూ మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య వివాదాలు తప్పేలా లేవని సత్య నాదెళ్ల అభిప్రాయం వ్యక్తం చేశారు.