Begin typing your search above and press return to search.

జనసేనకు కామన్ సింబల్ ప్రాబ్లం ..!?

ఇది చాలా పెద్ద నంబర్ కాబట్టి ఆ పార్టీకి కామన్ సింబల్ ని ఎన్నికల సంఘం కేటాయించింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 3:35 AM GMT
జనసేనకు కామన్ సింబల్ ప్రాబ్లం ..!?
X

జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇపుడు పెద్ద చర్చగా ఉంది. నిజానికి చూస్తే ఇది ఈ టైం లో జరగాల్సిన చర్చ కాదు. కానీ రాజకీయాల్లో అన్నీ కౌంట్ అవుతాయి. అన్నీ పాయింట్లుగానే ముందుకు వస్తాయి. జనసేన 2014 మార్చిలో ఏర్పాటు అయింది. 2019 ఎన్నికల్లో పోటీకి దిగింది. అయితే ఆ ఎన్నికల్లో జనసేన బీఎస్పీ కామ్రేడ్స్ తో కలసి పోటీ చేసింది. తాను సొంతంగా 137 సీట్లకు పోటీ చేసింది.

ఇది చాలా పెద్ద నంబర్ కాబట్టి ఆ పార్టీకి కామన్ సింబల్ ని ఎన్నికల సంఘం కేటాయించింది. అలా గాజు గ్లాస్ ని జనసేనకు ఇచ్చారు. అయితే కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు అయినా ఆరు శాతం ఓట్లు అయినా ఆ పార్టీకి రావాల్సి ఉంది. ఈ నిబంధనలు సరిపోక జనసేన కామన్ సింబల్ పోయింది. ఆ పార్టీని గుర్తింపు లేని పార్టీల జాబితాలో చేర్చారు.

ఇదిలా ఉంటే టీడీపీ తో కలసి జనసేన అధినేత వైసీపీ విషయంలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారు అని ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. దాంతో సీఈసీని కలసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేనను ఎందుకు మీటింగ్ కి పిలిచారు అని ప్రశ్నించినట్లుగా చెప్పారు.

ఆ పార్టీకి కామన్ సింబల్ ఎలా ఇస్తారు అని కూడా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను అడిగినట్లుగా మీడియాకు చెప్పారు. అది చట్టబద్ధం కాదని కూడా చెప్పినట్లుగా మీడియా ముందు వెల్లడించారు. ఇవన్నీ పక్కన పెడితే జనసేనకు కామన్ సింబల్ ఇవ్వవచ్చా లేదా అన్న దాని మీద చర్చ సాగుతోంది.

జనసేన కామన్ సింబల్ పొందాలీ అంటే మొత్తం స్థానాలకు అయినా లేదా ఎక్కువ నంబర్ సీట్లకు అయినా పోటీ చేయాలా అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. నిజానికి ఎన్నికల గుర్తుని ఏ పార్టీకైనా కేటాయించే విషయంలో ఎన్నికల సంఘానికి విచక్షణాధికారం ఉంటుంది. గుర్తింపు పొందని పార్టీల విషయంలో ఒక చాన్స్ ఇవ్వాలని కూడా ఆ విచక్షణాధికారం మేరకు మాత్రమే ఆలోచిస్తారు అని అంటున్నారు

జనసేన ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతోంది. దాంత జనసేన మొత్తం 175 సీట్లకు గానూ కొద్ది సీట్లకు మాత్రమే పోటీ చేస్తుంది. అంతే కాదు జనసేనకు 2019లో కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు జనరల్ సింబల్ గా ఉంది. అంటే జనసేన పోటీ చేయని చోట్ల ఇతర పార్టీలకు ఆ గుర్తుని ఇవ్వవచ్చు అని అంటున్నారు.

అయితే ఇపుడు జనసేన అభ్యర్ధులు అంతా ఇండిపెండెంట్లుగానే ఉంటారని, వారికి ఒకే గుర్తు ఇవ్వడం ఏంటి అన్న ప్రశ్నను వైసీపీ నేతలు సంధిస్తున్నారు. ఒకసారి కామన్ సింబల్ ఇచ్చినా గుర్తింపు అర్హత సాధించలేని పార్టీకి అదే గుర్తు ఎలా కేటాయిస్తారని లాజిక్ పాయింట్ ని ముందుకు తెస్తున్నారు

దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జనసేనకు ఇప్పటికే ఒక ఇబ్బంది ఉంది. అదేంటి అంటే ఆ పార్టీ పోటీ చేయని చోట్ల గాజు గ్లాస్ గుర్తుని వేరే ఇండిపెండెంట్లకు ఇవ్వవచ్చు. అలా జనసేన లేని చోట్ల ఆ పార్టీ ఓట్లు టీడీపీకి పడాల్సినవి ఇండిపెండెంట్లకు వెళ్ళే చాన్స్ ఉంది. ఆ ఇబ్బంది ఉండగానే ఇపుడు జనసేనకు కామన్ సింబల్ గా గాజు గ్లాస్ ఇవ్వవద్దు అని వైసీపీ ఫిర్యాదు చేసింది.

దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠంగా ఉంది. సాధారణంగా ఒక రిజిష్టర్ పార్టీ తన అభ్యర్ధులందరికీ ఒకే గుర్తు అడిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి ఇచ్చే వీలు కూడా ఉంది. ఆ విధంగా చూస్తే గాజు గ్లాస్ గుర్తు జనసేనకు ఉండవచ్చు అని అంటున్నారు.