Begin typing your search above and press return to search.

ఏమిటీ కామన్ సివిల్ కోడ్? అది అమలైతే ఏం జరుగుతుంది?

మిగిలిన పార్టీలకు భిన్నంగా భారతీయ జనతాపార్టీని నిలిపిన అంశాల్లో కీలకమైనది ఉమ్మడి పౌరస్మ్రతి (

By:  Tupaki Desk   |   12 Nov 2023 3:30 PM GMT
ఏమిటీ కామన్ సివిల్ కోడ్? అది అమలైతే ఏం జరుగుతుంది?
X

మిగిలిన పార్టీలకు భిన్నంగా భారతీయ జనతాపార్టీని నిలిపిన అంశాల్లో కీలకమైనది ఉమ్మడి పౌరస్మ్రతి (కామన్ సివిల్ కోడ్) కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ ను అమల్లోకి తెస్తామని చెప్పటం తెలిసిందే. అందుకు తగ్గట్లే.. మరో రెండు వారాల్లో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమల్లోకి తేనున్న ఈ చట్టం ఏమిటి? అందులో ఏముంటుంది? అది చట్టంగా మారితే ఏం జరుగుతుంది? అన్న వివరాల్లోకి వెళితే.. ఇదేమిటన్న అవగాహన కలుగుతుంది.

ఉమ్మడి పౌర స్మ్రతి అంటే.. కులాలు.. మతాలు..ఆడ.. మగ అనన తేడాలకు భిన్నంగా దేశంలోని అందరు ప్రజలకు ఒకే రకమైన వ్యక్తిగత చట్టాల్ని వర్తింపచేయటమే ఉమ్మడి పౌరస్మ్రతి లక్ష్యం. అయితే.. ఇప్పటివరకు అమల్లో ఉన్న దాని ప్రకారం మతం ఆధారంగా చట్టాల్ని రూపొందించారు. దీంతో... ఒకేలాంటి సమస్యకు ఒక మతం వారికి ఒకలా.. మరో మతం వారికి ఇంకోలాంటి చర్యలు ఉండేవి. అయితే.. కామన్ సివిల్ కోడ్ ను అమల్లోకి తీసుకొస్తే.. కొన్ని గిరిజన తెగలకు దక్కే ప్రత్యేక మినహాయింపులు పోతాయన్నది ఆందోళన. ఈ పేరుతో జరిగే రాజకీయం ఇంతకాలం దేశంలోని అందరి పౌరులకు ఒకేలాంటి వ్యక్తిగత చట్టాన్ని తీసుకురాలేని పరిస్థితి ఉండేది.

ఈ కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే.. ఇప్పటివరకు అమల్లో ఉన్న పలు మత.. ఆచార.. సంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దు అవుతాయి. వివాహాలు.. విడాకులు.. వారసత్వం.. దత్తత లాంటి పలు వ్యక్తిగత అంశాలన్ని కూడా దేశ ప్రజలందరికి ఒకేలా అమల్లోకి వస్తాయి. రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

2024 లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ లోనూ కామన్ సివిల్ కోడ్ ను అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. ఇదంతా సరే.. ఇంతకీ కామన్ సివిల్ కోడ్ అంశంపై రాజ్యాంగం ఏమంటోంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ‘దేశవ్యాప్తంగా పౌరులందరికి ఉమ్మడి పౌరస్మ్రతి అమలు చేయాలి’ అని పేర్కొన్నారు. అయితే.. దీన్ని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగంగానే పేర్కొనటంతో దీని అమలు తప్పనిసరి కాదు. ఈ కారణంగానే కామన్ సివిల్ కోడ్ ను అమలు చేయాలని కోర్టులు ఆదేశించే పరిస్థితి లేదు.

కామన్ సివిల్ కోడ్ అంశాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం పలు కేసు తీర్పుల్లో దీని అవసరాన్ని ప్రస్తావించటం కనిపిస్తుంది. అయితే.. 2018లోమోడీ సర్కారు కోరిన నేపథ్యంలో కేంద్ర లా కమిషన్ ఈ అంశంపై లోతుగా పరిశీలించి.. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన వ్యాఖ్య చేయటం గమనార్హం. ఈ అంశంపై లా కమిషన్ కేంద్రానికి ఒక నివేదికను ఇచ్చింది. 185 పేజీలున్న ఈ రిపోర్టులో.. దేశానికి ఉమ్మడి పౌరస్మ్రతి అవసరం లేదు.. అభిలషణీయం కాదన్న మాట చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కామన్ సివిల్ కోడ్ ను బీజేపీ గట్టిగా సమర్థిస్తుంటే.. కాంగ్రెస్.. మజ్లిస్ తదితర పార్టీలుమాత్రం వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగంలోని 29వ అధికరణానికి యూసీసీ విరుద్ధమన్నది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాదన. బహుళత్వం.. వైవిధ్యమే మన దేశానికి సంపదని.. అలాంటిది యూసీసీ పేరుతో ఆ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారన్న వాదనను ఆయన వినిపిస్తున్నారు. అయితే.. ఈ భిన్నాభిప్రాయాల నడుమ కామన్ సివిల్ కోడ్ తెచ్చే విషయంలో మోడీ సర్కారు బలంగా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు.. దీన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమల్లోకి తేవాలని భావిస్తోంది.