ఎర్రజెండాలు ఎగరట్లేదే.. ఏమైనట్టు..?
ఎర్ర జెండాలతో కార్మికులను పోగేసి వాలిపోయిన నాయకులు.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు
By: Tupaki Desk | 28 July 2023 7:28 AM GMTఎర్రజెండెర్రజెండెన్నీయెల్లో.. అనే పాటలు వినిపించడం లేదు. బూర్జువా పార్టీలను అంతం చేసేందుకు నడుం బిగించాలి-అంటూ..పటపట పళ్లు కొరికే కామ్రెడ్లు కనిపించడం లేదు. మరి ఏమైనట్టు.. ? కామ్రెడ్స్ ఖాళీ అయ్యారా.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కన పెట్టారా? ఏపీలో కమ్యూనిస్టుల ప్రభావం ఎంత? అంటే.. నేతిబీరలో నెయ్యంత? అంటున్నారు ఏపీ ప్రజలు. ఇప్పుడు ప్రజల మధ్య జరుగుతున్న కీలకచర్చ ఇదే.
దీనికి కారణం.. ఒకప్పుడు ఎటు చూసినా.. ఏదొ ఒక సమస్యతో ప్రజల మధ్య ఎగిరిన ఎర్ర జెండా.. ఇప్పుడు ఎగరడం లేదు. గ్యాస్ ధరలు పెరిగినా.. పెట్రో చార్జీలు పెరిగినా.. రోడ్లు దిగ్భందం చేసి.. ఎర్ర జెండాలతో కార్మికులను పోగేసి వాలిపోయిన నాయకులు.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.
కనీసం.. బలమైన ఉద్యమాలకు ప్రాతిపదిక కూడా చేయలేక పోతున్నారు. దీంతో గ్రామీణ స్థాయిలోనూ కమ్యూనిస్టులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి.. రాష్ట్రంలో సమస్యలు లేవా? ప్రజలు అంతా సంతోషంగా ఉంటున్నారా? అంటే.. అదేమీ లేదు. ఎన్ని పథకాలు అమలు చేసినా.. ప్రజలకు కరెంటు సమస్య ఉంది. చెత్తపై పన్నుల ప్రభావం ఉంది. నిరుద్యోగ సమస్య కూడా ఉంది.
మీటర్ల మార్పు అంశం కూడా రగులుతూనే ఉంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నా.. కమ్యూనిస్టులు ఎక్కడా కనిపించడం లేదు. ఆయా సమస్యలపై ఏదో మీడియా ముందుకు వచ్చి.. నాలుగు మాటలు అనేసి చేతులు దులుపుకొంటున్నారు.
దీంతో ఇప్పుడు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభావం గురించి కానీ, ఇతరత్రా విషయాల గురించి కానీ.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. అసలు కమ్యూనిస్టుల ఊసు కూడా ఎక్కడా వినిపించడం లేదు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే విషయంపైనా కమ్యూనిస్టులు తర్జన భర్జన పడుతున్నారు.
దీంతో వారికి ఇప్పుడు సమస్యలకన్నాకూడా.. పొత్తులు.. ఎత్తులపైనే ప్రధానంగా దృష్టి ఉందని చెబుతున్నారు. సో.. మొత్తానికి రెపరెపలాడిన ఎర్ర జెండా సిద్ధాంతాల సుడిలో ఎదురీదలేక.. ముడుచుకుపోయిందనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.