రేవంత్ టీంలో కొత్త టెన్షన్.. కామ్రెడ్ల కోరికలకు అంతే లేదా
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోని కీలకమైన ఇబ్రహీంపట్నం టికెట్ ను మల్ రెడ్డి రంగారెడ్డి ఆశిస్తుండగా సీపీఎం తమకు ఈ సీటు ఇవ్వాలని ప్రతిపాదించిందని సమాచారం.
By: Tupaki Desk | 22 Sep 2023 2:45 AM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ ఎత్తులు పై ఎత్తులు జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొద్దికాలం క్రితం వరకూ లెఫ్ట్ పార్టీలతో దోస్తీ కట్టిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్... హఠాత్తుగా వారిని సైడ్ చేసేశారు. కామ్రెడ్లకు బలం ఉందని వారు చెప్పుకొనే నియోజకవర్గాల్లో కూడా తన పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేసేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దీంతో కస్సుమన్న కామ్రెడ్లు.. కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యే పనిలో పడ్డారు. అయితే ఇప్పుడు హస్తం పార్టీ అవాక్కయ్యే ప్రతిపాదనలు వారి ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ తో పొత్తుకు బ్రేక్ వేస్తూ గులాబీ దళపతి కేసీఆర్ అవాక్కయ్యే అంతటి షాక్ ఇవ్వడంతో కామ్రేడ్ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ కలిసే కొనసాగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీలకు సులభమైపోయింది. దీంతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, కామ్రెడ్ పార్టీ నేతలు అడుగుతున్న సీట్ల విషయంలోనే కాంగ్రెస్ నేతలకు షాక్ అవుతున్నారట. కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, దేవరకొండ స్థానాలను సీపీఐ ఆశిస్తుండగా మధిర, ఖమ్మం, భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నంలో తమకు అవకాశం ఇవ్వాలని సీపీఎం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్ కీలక నేతల నియోజకవర్గాలు ఇవే కావడంతో హస్తం పార్టీలో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర స్థానం కోసం సీపీఎం పట్టుబడుతుండటం కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ గా మారిందని అంటున్నారు. దీంతోపాటుగా ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో ముఖ్యమైన నేతగా గుర్తింపు పొంది కాంగ్రెస్ లో ఇటీవలే చేరిన తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా సీపీఎం తమకే ఇక్కడ చాన్స్ ఇవ్వాలని డిమాండ్ పెట్టిందట. ఖమ్మం సీటునూ కామ్రేడ్లు అడుగుతున్నారని సమాచారం.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోని కీలకమైన ఇబ్రహీంపట్నం టికెట్ ను మల్ రెడ్డి రంగారెడ్డి ఆశిస్తుండగా సీపీఎం తమకు ఈ సీటు ఇవ్వాలని ప్రతిపాదించిందని సమాచారం. దీంతో కాంగ్రెస్ నేతలే స్వయంగా కామ్రెడ్లతో పొత్తు విషయంలో డైలమాలో పడ్డారని సమాచారం. దీంతో అసలు కాంగ్రెస్ తో కమ్యూనిస్టులకు పొత్తు కుదురుతుందా..? చర్చల ద్వారా కొన్ని నియోజకవర్గాలను వదులుకునేందుకు ఆ పార్టీ నేతలు ఒప్పుకొంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, చివరి నిమిషంలో కమ్యూనిస్టు నేతలే తమ డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గుతారని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నట్లు చెప్తున్నారు.