అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే వారికి 2వేల కంపెనీలు ఆఫర్లు
ఇరవై కాదు. ఏకంగా 2వేలకు పైనే కంపెనీలు ఓటు వేసిన ఓటర్లకు ప్రత్యేక బహుమానాలు ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాయి.
By: Tupaki Desk | 4 Nov 2024 4:45 AM GMTకొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన వారికి పలు కంపెనీలు ఆఫర్లు.. ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించటం తెలిసిందే. ఇదే ట్రెండ్ అమెరికాలోనూ నడుస్తోంది. మరో రోజులో జరిగే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ వేళ.. ఓటు వేసిన వారికి బోలెడన్ని బహుమానాలతో సిద్ధంగా ఉన్నాయి కంపెనీలు. అది కూడా పది.. ఇరవై కాదు. ఏకంగా 2వేలకు పైనే కంపెనీలు ఓటు వేసిన ఓటర్లకు ప్రత్యేక బహుమానాలు ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాయి.
ఎన్నికల వేళ.. ఉద్యోగులు ఓటు వేసి వచ్చేందుకు వీలుగా పలు కంపెనీలు ఫ్రీ జర్నీలను ఏర్పాటు చేశాయి. అంతేకాదు.. ఓటు వేసిన వారికి ఉచితంగా డోనట్స్ ఇస్తున్నట్లుగా ప్రకటించాయి. ఓటేసే ఓటర్లకు.. ఓటేసిన ఓటర్లకు ఎన్నెన్ని ఆఫర్లు ఉన్నాయన్న దానికి సంబంధించిన ముఖ్యమైనవి చూస్తే..
పోలింగ్ రోజున ఓటేసేందుకు వెళ్లే ఓటర్లు ఉబెర్ క్యాబ్ సేవల్ని వినియోగించుకుంటే 50 శాతం డిస్కౌంట్ ను పొందే వీలుంది. కాకుంటే.. యాప్ లో ‘గో ఓట్’ అనే బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు 10 డాలర్ల మొత్తాన్నిగరిష్ఠంగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఉబర్ ఈట్స్ లో 25 శాతం రాయితీ ఇచ్చేందుకు వీలుగా ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఉబర్ యాప్ లో దగ్గర్లో ఉండే పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. లిఫ్ట్ యాప్ విషయానికి వస్తే.. 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. తమ ఆఫర్లతో కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని చెబుతోంది. కార్లను అద్దెకు ఇస్తే హెర కట్జ్ అయితే..అక్టోబరు 21 నుంచి నవంబరు 5 వరకు రెండు లేదంటే అంతకు మించి ఎక్కువగా అద్దెకు తీసుకుంటే.. ఒక రోజు అద్దెను రాయితీ రూపంలో ప్రకటించింది.
డోనట్స్ కు పేరున్న క్రిస్పీ క్రీమ్ సంస్థ.. ఉచితంగా డోనట్స్ ను ఆఫర్ చేస్తోంది. యూఎస్ లోని తమకు చెందిన ఔట్ లెట్లలో ఉచితంగా డోనట్స్ ను ఆఫర్ చేస్తోంది.డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ సంస్థ ఓటేసినట్లుగా రుజువు చూపించి.. తమ ఔట్ లెట్ లో ఏమైనా కొంటే ఉచితంగా షేక్ ఇస్తామని ప్రకటించింది. ఎక్కువ పిజ్జా స్టోర్లు ఉన్న ‘రౌండ్ టేబుల్ పిజ్జా’ తమ వద్ద ఉన్న అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల రాయితీని ప్రకటించింది. ఐకియా సైతం ఓట్లు వేసిన వారికి ఫ్రెజెన్ యోగర్ట్ ను ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని 8 రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లు ఉన్న లేజీ డాగ్ కూడా ఐ ఓట స్టిక్కర్ ఉన్న వారికి నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ను ఫ్రీగా ఇస్తున్నట్లు పేర్కొంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే వారికి ఉచితంగా రైడ్ ఇవ్వనున్నట్లుగా లైమ్ పేర్కొంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని కంపెనీలు ఓటేసిన ఓటర్లకు రాయితీలతో ముంచెత్తేలా ప్రకటనలు చేస్తున్నాయి.