Begin typing your search above and press return to search.

చైనా కంపెనీల దుర్మార్గం.. మహిళా ఉద్యోగులకు ఆ పరీక్ష

ప్రపంచ వ్యాప్తంగా చైనా కంపెనీలు అనుసరిస్తున్న ఈ దుర్మార్గాన్ని ఛీకొడుతున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 11:30 AM GMT
చైనా కంపెనీల దుర్మార్గం.. మహిళా ఉద్యోగులకు ఆ పరీక్ష
X

మనుషుల్ని కదిలే యంత్రాలుగా చూసే కల్చర్ చైనాలో ఎంతన్న విషయం అక్కడ పని చేసే వారిని అడిగితే తెలుస్తుంది. తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పని చేయించటం.. వారికి కల్పించాల్సిన కనీససౌకర్యాల విషయంలో చైనా కంపెనీలు అమానుషంగా వ్యవహరిస్తుంటాయన్న విమర్శ మొదట్నించి ఉన్నదే. తాజాగా కంపెనీల కర్కశత్వం.. అరాచకం ఎంతన్న విషయం బయటకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా చైనా కంపెనీలు అనుసరిస్తున్న ఈ దుర్మార్గాన్ని ఛీకొడుతున్నారు. ఇంతకు వారు చేస్తున్న దారుణం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ఉద్యోగాల కోసం అప్లై చేసే మహిళలకు కొలువు ఇవ్వటానికి ముందు వారి గర్భ నిర్ధరణ పరీక్షలు చేయటమే కాదు.. వారి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి తెలుసుకుంటారన్న విషయం వెలుగు చూసింది. నిజానికి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలా చేయటం నేరం. శిక్షార్షం. కానీ.. లాభాల కక్కుర్తితో పాటు.. ఉద్యోగుల చేత మరింత ఎక్కువగా పని చేయించాలన్న కరకుతనం ఇలాంటి దుస్థితికి కారణంగా చెప్పాలి. ఇంతకూ చైనా కంపెనీలు చేస్తున్నదేమంటే.. తమ వద్ద పని చేసే ఉద్యోగులతో పాటు.. తమ వద్ద జాబ్ కోసం వచ్చే మహిళలకు అక్రమ పద్దతిలో గర్భ నిర్దరణ పరీక్షలు చేయిస్తున్నారు.

జాబ్ ఇచ్చే ముందు ఫిజికల్ టెస్టులుగా పేర్కొంటున్న కంపెనీలు.. పనిలో పనిగా ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయిస్తున్నారు. ఒకవేళ కొత్తగా పెళ్లైన వారు ఉంటే.. వారి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అడుగుతూ.. వారికి జాబ్ ఇవ్వాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్న వారికి సెలవులు ఇవ్వాల్సి రావటం.. దాని కారణంగా తమ ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి పాడు పనులకు అక్కడి కంపెనీలు తెర తీస్తున్నట్లు చెబుతున్నారు.

జింగ్సు ప్రావిన్స్ లోని నాన్ టాంగ్ లోని పదహారు కంపెనీలు తమ వద్ద ఉద్యోగాలకు వచ్చిన 168 మంది మహిళలకు అక్రమంగా గర్భ నిర్ధరణ పరీక్షలు చేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు.. ఈ తరహాలో వ్యవహరిస్తున్న వారి వివరాల్ని ఆరా తీస్తున్నారు. చైనాలోని నిబంధనల ప్రకారం కంపెనీలు కానీ యాజమాన్యాలు కానీ గర్భనిర్ధరణ పరీక్షలు నిర్వహించటం.. గర్భిణుల విషయంలో వివక్ష చూపటంపై నిషేధం ఉంది.

ఇప్పటికే అత్యల్ప జనన రేటు సమస్యను ఎదుర్కొంటున్న చైనాకు.. పలు కంపెనీలు గర్భిణులను జాబ్ లోకి తీసుకోవటానికి సంకోచిస్తున్న వైనాన్ని గుర్తించారు. అంతేకాదు.. ఎవరైనా మహిళలకు చిన్న పిల్లలు ఉంటే.. అలాంటి వారిని సైతం జాబ్ లోకి తీసుకోవటానికి ఆసక్తి చూపటం లేదని చెబుతున్నారు.

మహిళల విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న ఈ దుర్మార్గ వైఖరిపై ఆ దేశానికి చెందిన ఒక ఆన్ లైన్ పబ్లిక్ లిటిగేషన్ సంస్థ ప్రభుత్వం ద్రష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో.. అలెర్టు అయిన అక్కడి అధికారులు సదరు సంస్థతో కలిసి కొన్ని ఆసుపత్రులు.. ల్యాబ్ లో తనిఖీలు చేపట్టారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. నేరాలకు పాల్పడిన కంపెనీకి 6900 డాలర్ల చొప్పున జరిమానా విధిస్తారని చెబుతున్నారు.

గడిచిన కొంతకాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా పడిపోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా పరిస్థితి మరింత ఎక్కువైందంటున్నారు. 1949 తర్వాత ఈ స్థాయిలో జననాల రేటు తక్కువగా నమోదు కావటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ తరహా పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా అభివర్ణిస్తున్నారు.