Begin typing your search above and press return to search.

భర్తతో విడాకులు.. గోవాలో కొడుకును చంపేసిన కంపెనీ సీఈవో

శనివారం గోవాలోని అపార్టుమెంట్ లో చెకిన్ అయిన ఆమె.. సోమవారం ఉదయం అద్దె కారులో బెంగళూరుకు బయలుదేరారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 5:01 AM GMT
భర్తతో విడాకులు.. గోవాలో కొడుకును చంపేసిన కంపెనీ సీఈవో
X

అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చిన తాజా ఉదంతం గురించి తెలిసినంతనే విస్మయానికి గురి కావాల్సిందే. చదువురాని వారు.. గ్రామీణ ప్రాంతానికి చెందినోళ్లు.. ఆర్థికంగా వెనుకబడిన వారు సైతం చేయని దుర్మార్గానికి బాగా చదువుకొని.. ఆర్థికంగా బలమైన స్థానంలో ఉండి.. ఒక కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న ఒక మహిళ చేసిన దురాగతం షాకింగ్ గా మారింది. బెంగళూరుకు చెందిన సుచనా సేఠ్ ఒక స్టార్టప్ కంపెనీ సీఈవో. భర్తతో విడాకులు తీసుకొని విడిగా బతుకుతున్నారు.

తాజాగా తన కొడుకును తీసుకొని గోవాకు వెళ్లారు. అక్కడో అపార్టుమెంట్ ను అద్దెకు తీసుకొని ఉన్నారు. శనివారం గోవాలోని అపార్టుమెంట్ లో చెకిన్ అయిన ఆమె.. సోమవారం ఉదయం అద్దె కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఇందుకోసం కారును అపార్టుమెంట్ నిర్వాహకులు అరెంజ్ చేశారు. చెక్ అవుట్ చేసిన తర్వాత క్లీనింగ్ లో భాగంగా సంస్థ సిబ్బంది రక్తపు మరకల్ని గుర్తించారు. వెంటనే నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన వారు.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ను గమనించగా.. చెకిన్ టైంలో కొడుకుతో వచ్చిన ఆమె.. తిరిగి వెళ్లే వేళలో పెద్ద సూట్ కేసుతో ఒక్కటే వెళ్లటాన్ని గుర్తించారు. వెంటనే ఆమెను తీసుకెళుతున్న కారు డ్రైవర్ ను ఫోన్ లో సంప్రదించి.. ఆమెతోనూ మాట్లాడారు. కొడుకు గురించి ఆరా తీయగా.. గోవాలోని ఫ్రెండ్ ఇంట్లో వదిలి వస్తున్నట్లు పేర్కొంది. సదరు గోవా ఫ్రెండ్ అడ్రెస్ ఆరా తీయగా.. అది ఫేక్ అని తేలింది. దీంతో.. మరోసారి కారు డ్రైవర్ కు ఫోన్ చేసిన గోవా పోలీసులు.. డ్రైవర్ తో కొంకణి భాషలో మాట్లాడి..ఆమె గురించి చెప్పారు. ఆ సమయానికి వారి కారు కర్ణాటక రాష్ట్ర పరిధిలోకి చేరుకుంది. దీంతో.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వివరాలు చెప్పారు.

అనుమానం వచ్చిన పోలీసులు ఆమె లగేజ్ ను చెక్ చేయగా.. సూట్ కేసులో నాలుగేళ్ల కొడుకు డెడ్ బాడీని కుక్కినట్లుగా గుర్తించారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వెంట ఉన్న సూట్ కేసులో కొడుకు డెడ్ బాడీని గుర్తించారు. కొడుకును ఎందుకు హత్య చేశారన్న దారిపై స్పష్టత రాలేదు. కానీ.. ఒక అంకుర సంస్థ సీఈవోగా వ్యవహరిస్తూ ఇలాంటి కిరాతకానికి పాల్పడటమా? అంటూ విస్మయానికి గురవుతున్నారు.

దెయ్యంగా మారిన తల్లి సుచనా సేథ్ గురించి వివరాల్ని చూస్తే.. 39 ఏళ్ల ఆమె 2021 ఏడాదికి 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఏఐ ఏథిక్స్ లో ఒకరిగా నిలిచారు. మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ అను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సుచనా కేరళకు చెందిన వెంకట్ రామన్ ను 2010లో పెళ్లాడారు. 2019లో వారికో బాబు పుట్టారు. విభేదాలు రావటంతో వారు 2020లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంటుండగా.. వెంకటరామన్ ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఉంటున్నాడు. విడాకుల వేళ.. కోర్టు చెప్పినట్లుగా కొడుకును చూసేందుకు తండ్రికి అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు.