వరద వేళ చంద్రబాబు ముందు తేలిపోయిన రేవంత్!
అలా అని ఆయన్ను తక్కువ చేయటం కాదు కానీ.. చంద్రబాబు పడిన కష్టంతో పోల్చినప్పుడు కాస్త తక్కువగానే ఉన్నారని చెప్పాలి.
By: Tupaki Desk | 3 Sep 2024 8:16 AM GMTఒకేలాంటి పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సందర్భంలో చోటు చేసుకోవటం చాలా తక్కువ సందర్భాల్లోనే జరిగింది ఈ పదేళ్లలో. ఒకే సందర్భంలో భారీ వర్షాలు.. వరదలు లాంటివి చోటు చేసుకోవటం.. ఒకేలాంటి పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకోవటం ఇదే తొలిసారి. ఏపీలో విజయవాడ దారుణంగా ప్రభావితమైతే.. తెలంగాణలో ఖమ్మం పట్టణం ప్రభావితమైంది. అటు విజయవాడ, ఇటు ఖమ్మం పట్టణాల్లో అత్యధిక భాగం వరదనీరుతో నిండింది. లక్షలాది మంది ప్రజలు సాయాన్ని కోరుకున్న పరిస్థితి.
అంతేకాదు.. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే సందర్భంలో వేలాది ఎకరాల పంట దెబ్బ తినటంతో పాటు.. ఆస్తినష్టం భారీగా జరిగింది. ఇటీవల కాలంలో విపత్తులు చోటు చేసుకున్న సమయంలో మరణాల సంఖ్య తక్కువగా ఉంటే.. ఈసారి రెండు రాష్ట్రాల్లోనూ నమోదయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే సందర్భంలో విరుచుకుపడిన వరద వేళ.. రెండు ప్రభుత్వాలు ఎలా స్పందించాయి? అక్కడి ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంది? ముఖ్యమంత్రుల పని తీరు సంగతేంటి? లాంటి ప్రశ్నలు తలెత్తాయి.
వరదల తీవ్రత రెండు రాష్ట్రాల్లోనూ ఒకేలాంటి పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లోని విపక్షాలు అధికారపక్షం వైఫల్యాలపై విరుచుకుపడ్డాయి. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. దగ్గర దగ్గర నడుము లోతు వరకు వరద నీరు ఉన్న ప్రాంతాలకు వెళ్లి మరీ.. బాధితుల్ని పరామర్శించటం కనిపించింది. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా కేటీఆర్.. హరీశ్ రావులు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు సంధించారు. వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.
బాధితులకు సహాయ సహకారాలు అందించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడగా.. తెలంగాణతో పోలిస్తే ఏపీలో కాస్త మెరుగైన సహాయం అందిందన్న భావన వ్యక్తమైంది. తెలంగాణలో ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా కొందరు కీలక మంత్రులు పొంగులేటి.. శ్రీధర్ బాబు లాంటి వారితో పాటు సీనియర్ నేత తుమ్మల లాంటి వారు బాధితుల వద్దకు వెళ్లి వారిని ఓదార్చే ప్రయత్నం చేయటం కనిపించింది. ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అంతా తానై అన్నట్లుగా వ్యవహరించారు. మంత్రి లోకేశ్ తో పాటు.. మరికొందరు సీన్ లో కనిపించినా హైలెట్ కాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ముఖ్యమంత్రుల విషయానికి వస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ.. బాధితులను ఊరడించే ప్రయత్నం చేశారు. కేవలం మూడు గంటల పాటు మాత్రమే విశ్రాంతి తీసుకున్న ఆయన సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు బయటకు వచ్చేసి పనుల్లో పడ్డారు. మళ్లీ సోమవారం అర్థరాత్రి రెండు గంటల వరకు బాధితులకు అందే సహాయ సహకారాల మీదే ఫోకస్ చేశారు. చంద్రబాబుతో పోలిస్తే తెలంగాణ రాష్ర ముఖ్యమంత్రి రేవంత్ కాస్తంత తేలిపోయారనే చెప్పాలి.
అలా అని ఆయన్ను తక్కువ చేయటం కాదు కానీ.. చంద్రబాబు పడిన కష్టంతో పోల్చినప్పుడు కాస్త తక్కువగానే ఉన్నారని చెప్పాలి. ఓవైపు భాదితుల తెగ ఇబ్బంది పడుతున్నా..ఆదివారం మధ్యామ్నం మాత్రమే ఖమ్మంకు వెళ్లిన పరిస్థితి. అదేదో మరికాస్త ముందుగా వెళ్లి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా రెండు రాష్ట్రాల సీఎంలను పోల్చినప్పుడు చంద్రబాబు పని తీరు మెరుగ్గా ఉండగా.. రేవంత్ మరింత శ్రమించాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.